Mother dies 23 days After Giving Birth To Baby : పసి పాపకు జన్మనిచ్చి నెలరోజులైనా కాలేదు, అంతలోనే ఆ తల్లి ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. ఆ పసికందును బతికించుకునేందుకు అమ్మమ్మ, ఆమె అత్తయ్యలు పడరాని పాట్లు పడుతున్నారు. పసిబిడ్డ ఆకలి తీర్చేందుకు పాలడబ్బా కోసం గూడెం నుంచి రానూపోనూ 6 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం దుబ్బగూడ పంచాయతీ పరిధిలోని టెంబిరిగూడకు చెందిన దేశ్‌ముఖ్ మారుబాయికి ఆగస్టు 20న సొంత గ్రామంలో ప్రసవమైంది.
కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే సెప్టెంబరు 10న అనారోగ్యానికి గురి కావడంతో భర్త దేశ్‌ముఖ్ లస్మ, గ్రామస్థుల సహకారంతో ఆదిలాబాద్ రిమ్స్‌లో చేర్పించారు. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మారుబాయి సెప్టెంబరు 13న మృతి చెందినట్లుగా ఆమె భర్త తెలిపారు.
హైదరాబాద్ నుంచి రూ.12 వేలు ఖర్చు చేసి మృతదేహాన్ని తీసుకొచ్చామని, అదే రోజు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా రూ.20 వేల ఆర్థిక సాయం అందించారని అన్నారు. ఆమె మృతి చెందిన విషయం తెలుసుకున్న అభిమన్యూ వాట్సాప్ గ్రూపు నిర్వాహకుడు మెస్రం శేఖర్ బాబు పసి పాప పాల కోసం రూ.30 వేల ఆర్థిక సహాయం చేశారు. 3 రోజులకు ఒకసారి రూ.280 పాల డబ్బా కొనుగోలు చేసి, పాలు తాగిస్తూ పాపను బతికించుకుంటున్నామని అమ్మమ్మ లచ్చుబాయి తెలిపారు.