ICICI Bank Scam in Palnadu District Updates :పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట, విజయవాడ భారతినగర్ ఐసీఐసీఐ బ్రాంచ్‌ల్లో మోసపోయిన ఖాతాదారులకు ఊరట లభించింది. బాధిత ఖాతాదారులకు అధికారులు నగదును వెనక్కి ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. గతంలో మేనేజర్ ఉన్న నరేశ్ ఖాతాదారులను మోసం చేశాడని బ్యాంక్ ఉన్నతాధికారులు నిర్ధారించారు. మొత్తం 72 మంది ఖాతాదారుల నుంచి రూ.28 కోట్లు కొట్టేసినట్లు గుర్తించారు.
ఈ నెల 3న చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్‌లో నరేశ్ చేసిన మోసాలను బ్యాంకు జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా గుర్తించారు. బాధిత ఖాతాదారులను విచారణ చేసి వారి పేర్లు నమోదు చేసుకున్నారు. దీనిపై ఆయన విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అక్కడినుంచి ఈ కేసును గుంటూరు సీఐడీ కార్యాలయానికి బదిలీ చేశారు. దీంతో గుంటూరు సీఐడీ అదనపు ఎస్పి ఆదినారాయణ, సీఐ సంజీవ్ కుమార్ల ఆధ్వర్యంలో పదిమంది బృందం గత గురువారం చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో విచారణ ప్రారంభించారు. బ్యాంకులో సిబ్బందితోపాటు ఖాతాదారులను శనివారం వరకు విచారించారు.
ICICI Bank Money Refunding Process : ఈ నేపథ్యంలోనే గత మేనేజర్ నరేశ్ సెల్ఫీ వీడియో విడుదల చేయడంతో కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చింది. తాను ఒక్కడినే మోసానికి పాల్పడలేదని, ఎవరెవరి పాత్ర ఉందో ఆ వీడియోలో వెల్లడించారు. ఇవన్నీ నిర్ధారించుకున్న బ్యాంకు ఉన్నతాధికారులు బాధితులకు సత్వరమే న్యాయం చేసేలా చర్యలు చేపట్టారు. ఇవాళ బాధిత ఖాతాదారులను పిలిపించి వారు పోగొట్టుకున్న నగదును తిరిగి ఇచ్చే ప్రక్రియను చేపట్టారు. బ్యాంకు జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా నష్టపోయిన ప్రతి ఖాతాదారుడికి బ్యాంక్ తిరిగి చెల్లిస్తుందని చెప్పారు. తక్షణమే స్పందించి తమకు అండగా నిలిచిన బ్యాంకు అధికారులతో పాటు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు, ఈనాడు-ఈటీవీ భారత్‌కి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.