Money Lenders threatening Customers in Kamareddy :అమాయకపు ప్రజల అవసరాలే వడ్డీ వ్యాపారుల ఆదాయాలుగా మారుతున్నాయి. పేదలకు అధిక వడ్డీలకు అప్పులిచ్చి సాధారణం కంటే రెట్టింపు వడ్డీ వసూలు చేస్తూ వారి శ్రమను దోచేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో కొందరు వడ్డీ వ్యాపారులు అడ్డూ అదుపు లేకుండా చెలరేగి పోతున్నారు. లక్ష రూపాయలు అప్పు ఇచ్చి, ఆరు నెలల్లోనే రెండు లక్షలు వసూలు చేస్తూ నిరుపేదల శ్రమను దోచేస్తున్నారు. అప్పు చెల్లించ లేని పక్షంలో కొందరైతే ఏకంగా దాడులు దిగుతున్నారు. రుణం(Loan) తీసుకున్న వారి కుటుంబ సభ్యుల్ని అపహరించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
కామారెడ్డి చెందిన యాదగిరి అనే వ్యక్తి ఇద్దరు వడ్డీ వ్యాపారుల దగ్గర లక్ష రూపాయలు అప్పుగా తీసుకుని రూ. 59 వేలు తిరిగి చెల్లించాడు. కానీ యాదగిరికి రహదారి ప్రమాదంలో కాలు విరిగి మూత్రపిండాల మీద ప్రభావం పడి అనారోగ్యం పాలయ్యాడు. దీంతో తీసుకున్న అప్పు చెల్లించడంలో కొంత ఆలస్యమైంది. అంతలోనే తండ్రి తీసుకున్న అప్పు చెల్లించడం లేదని అతని కుమారుడు సాయికుమార్‌ను గత మంగళవారం రాత్రి కొట్టి నిర్బంధించారు. రాత్రి మొత్తం వారి వద్దే ఉంచుకొని బుధవారం భవన నిర్మాణ పనికి తీసుకెళ్లగా, యువకుడు తప్పించుకొని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Police Focus On Money Lender Illegal Activities : ఈ మేరకు పలువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపులపై ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నవారి ఇళ్లలో 184 ప్రామిసరీ నోట్లు, 12 చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై మనీలాండరింగ్(Money Laundering) అతిక్రమణ చట్టం కింద కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఒక్క రోజులోనే 14 కేసులు నమోదయ్యాయి. తనిఖీలు కొనసాగే అవకాశం ఉండటంతో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. వేధింపుల నుంచి కాపాడాలని ప్రజలు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.