MLC Kodandaram on kaleshwaram : మేడగడ్డ డిజైన్ ఒకటైతే, నిర్మాణాన్ని మరో రకంగా చేయడంతోనే బ్యారేజీ కుంగిపోయిందని ఎమ్మెల్సీ కోదండరామ్ తెలిపారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించడం సరికాదని ఇంజినీర్లు పేర్కొన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్ట్ నిర్మాణానికి పూనుకుందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రీ డిజైనింగ్‌కు ముందు తుమ్మిడిహట్టి వద్ద డాక్టర్ బీ ఆర్.అంబేడ్కర్ సుజల స్రవంతి పేరుతో, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు.
మేడిగడ్డ నిర్మాణంపై ఆర్థికపరమైన అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని కాగ్ కూడా చెప్పిందని కోదండరాం తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ మెటీరియల్ సక్రమంగా లేదని, నిర్వహణ కూడా సరిగ్గా లేదని డ్యాం సేఫ్టీ అధికారులు తమ నివేదికలో చెప్పారని ఆయన పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి కాలువల ద్వారా నీటిని తెచ్చుకోగలిగితే, గతంలో ఖర్చు చేసిన నిధులకు సార్థకత దక్కుతుందని కోదండరాం అభిప్రాయపడ్డారు.
తుమ్మిడిహెట్టిని పరిశీలించాలని ప్రభుత్వం, కమిషన్‌ను కోరామని కోదండరాం తెలిపారు. ఇంజినీర్ల సూచనలను గత ప్రభుత్వం బేఖాతరు చేసిందని, మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై కమిషన్ వేయాలని బీఆర్ఎస్ పార్టీ కోరిందని కోదండరాం తెలిపారు. కమిషన్ వేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని అసెంబ్లీలో పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు.