Ministers Canceled Various Tours Due To Stampede incident :తిరుపతిలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ విచారం వ్యక్తంచేశారు. విషాదకర ఘటన నేపథ్యంలో నేతలు తమ పర్యటనలను రద్దు చేసుకున్నారు. సీఎం చంద్రబాబు మధ్వాహ్నం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇవాళ్టి కర్నూలు జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. తిరుపతి వెళ్లి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను సాయంత్రం పరామర్శించనున్నారు.
ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించి మంత్రి లోకేశ్ ఛైర్మన్ గా నేడు జరగాల్సిన మంత్రివర్గ ఉప సంఘం భేటీ వాయిదా పడింది. ఇవాళ అనంతపురంలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పాల్గొనడంలేదని లోకేశ్ ప్రకటించారు. ఈ విషాదకర సందర్భంలో అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడం సముచితం కాదు అనే ఉద్దేశంతో రద్దు చేస్తున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రూ.25లక్షల పరిహారం : తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25లక్షల పరిహారం ప్రకటించింది. రుయా ఆస్పత్రిలోని మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యులను మంత్రుల బృందం, జిల్లా కలెక్టర్ పరామర్శించారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంత్యక్రియలకు సహకారం అందించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.