APSRTC Special Buses for Kumbh Mela 2025 : మహా కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పుణ్య స్నానానికి వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. తక్కువ ఛార్జీతోనే దర్శనం చేయించి తిరిగి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. మూడు పూటలా రుచి, శుచికరమైన ఆంధ్ర భోజనం అందిస్తుంది. అంతే కాదు తిరుగు ప్రయాణంలో పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశాన్ని కల్పించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాతో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కిటకిటలాడుతోంది. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు కూడా పుణ్య స్నానానికి వెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కుంభమేళాకు వెళ్లేవారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఏ ప్రాంతం నుంచైనా 30 మంది భక్తులు బృందంగా కలిసి వస్తే వారు కోరుకున్న కేటగిరీ బస్సును కేటాయిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు భోజనానికి ఇబ్బంది పడకుండా బస్సుతోపాటు వంట మనిషిని కేటాయిస్తామన్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం వండించే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. నివాస ప్రాంతం నుంచి ప్రయాగరాజ్‌కు రూట్ నిర్ణయించి దాని ప్రకారం టికెట్ ఛార్జీ తీసుకుంటామని వివరించారు.
APSRTC Package for Maha Kumbh : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి కుంభమేళాకు ఫిబ్రవరి 1న సూపర్ లగ్జరీ, స్లీపర్ బస్సులు బయల్దేరనున్నట్లు పేర్కొన్నారు. వారికి పూరీ, కోణార్క్, ప్రయాగ్‌రాజ్, వారణాసి, బుద్దగయ్య, కాశీ తదితర క్షేత్రాల దర్శనం చేయించనున్నట్లు తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో ఒక్కొక్కరికి రానుపోను టికెట్, భోజన సదుపాయం కలిపి రూ.10,000లు, స్లీపర్ బస్సులో ఒక్కొక్కరికీ రూ.15,000లు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు.
బస్సు మొత్తం బుక్ చేసుకుంటున్నారు. ఆలయాల వద్ద ఆగి దర్శనాలు చేసుకుంటారు. ప్రజలు కావాలనుకుంటే బస్సులు ఏర్పాటు చేస్తాం. మీ దగ్గరలోని ఆర్టీసీ అధికారులు సంప్రదిస్తే వారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తారు. - విజయ రత్నం, ఆర్టీసీ ఈడీ, విజయవాడ జోన్
అలాగే రాజమహేంద్రవరం నుంచి ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 2 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయల్దేరుతుందని అధికారులు వివరించారు. భువనేశ్వర్, పూరీ, కోణార్క్, ప్రయాగ్‌రాజ్, వారణాసి, గయ, బుద్దగయ, విశ్వనాథ దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ బస్సుకు టికెట్ ఒక్కొక్కరికి రూ.10,000లుగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 18న మరో సూపర్ లగ్జరీ బస్సు బుక్ అయినట్లు పేర్కొన్నారు.
భువనేశ్వర్, పూరీ, కోణార్క్, బాజ్‌పూర్, ప్రయాగ్‌రాజ్, కాశీ, ఆయోధ్య, గయ, బుద్దగయ, అరసవెల్లి, అన్నవరం ఆలయాలకు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఈ బస్సులో ఒక్కొక్కరికి టికెట్ 12,800 రూపాయలుగా నిర్ణయించినట్లు వెల్లడించారు. కుంభమేళాకు ఆర్టీసీ బస్సులు కేటాయించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుణ్యస్నానానికి తీసుకెళ్లడంతో పాటు వివిధ ఆలయాల దర్శనం చేయించే అవకాశం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.