Installation Of One Lakh CC Cameras In AP: రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా ఆ దృశ్యాలు, నేరగాళ్ల కదలికలు నిఘా నేత్రాలకు చిక్కేలా పోలీస్ శాఖ పక్కాగా ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం మార్చి నెలాఖరుకల్లా రాష్ట్రవ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాల ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. ప్రధానంగా ప్రార్థన మందిరాలు, మతపరంగా సున్నితమైన ప్రాంతాలు, క్రైమ్ హాట్‌స్పాట్‌లు, కూడళ్లు సహా ప్రతిచోటా నిఘా నేత్రాలను ఏర్పాటు చేయనుంది. కొన్ని ప్రభుత్వం ద్వారా మరికొన్నింటిని ప్రజాభాగస్వామ్యంతో ఏర్పాటుచేసి వీటన్నింటినీ స్థానిక పోలీసుస్టేషన్లకు, కమాండ్ కంట్రోల్ రూమ్‌లకు అనుసంధానం చేయనుంది.
సాంకేతికత ద్వారా నేరాలకు అడ్డుకట్ట: రాష్ట్రంలో నేరాల నియంత్రణకు సాంకేతికత ద్వారా అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖ పటిష్ఠ చర్యలు చేపడుతోంది. నిరంతరం పహారా కాస్తూ ఎక్కడ నేరం జరిగినా నమోదు చేసేలా సీసీటీవీల ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. సీసీ కెమెరాలు లేనిచోట డ్రోన్ల ద్వారా నిఘాపెట్టేందుకు వీలుగా రాష్ట్రంలోని ప్రతి పోలీసుస్టేషన్‌కు కనీసం ఒక్క డ్రోన్ అయినా అందించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే డ్రోన్లను రద్దీ నిర్వహణ, నేర నియంత్రణకు వినియోగిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వీటి వినియోగాన్ని పెంచనున్నారు.
నిర్వహణను గాలికొదిలేసిన గత ప్రభుత్వం: 2014-19 సంవత్సరాలల్లో టీడీపీ హయాంలో రాష్ట్రంలో 14వేల సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. వాటికి సంబంధించి ‘పై డేటా’ సెంటర్‌లో నిక్షిప్తమైన దృశ్యాలను అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు పంపించేందుకు వీలుగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ సీసీ కెమెరాల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. అంతేకాకుండా సాఫ్ట్‌వేర్‌ను సైతం జిల్లాలకు పంపలేదు. దీంతో చాలా కెమెరాలు నిరూపయోగంగా మారి నేరాల రేటు పెరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజా భాగస్వామ్యంతో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా 25 వేల 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిలో నమోదైన దృశ్యాల ఆధారంగా 1,989 కేసులు చేధించి నిందితుల్ని పట్టుకున్నారు. 2,434 మంది అనుమానితులను గుర్తించారు.
నేరగాళ్లు ఎవరూ తప్పించుకోలేరు: కృష్ణా జిల్లా కంకిపాడులో బైక్‌ల చోరీ కేసులో సీసీ కెమెరాల్లో దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అతని వద్ద 20 లక్షల విలువైన 38 వాహనాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లాలో బాలికపై హత్యాచార ఘటనలోనూ సీసీ కెమెరాల ద్వారానే నిందితుడిని గుర్తించారు. కర్నూలు జిల్లాలో ఓ హత్య కేసును సైతం ఈ దృశ్యాల ఆధారంగా చేధించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొద్ది కెమెరాలతోనే ఈ స్థాయిలో నేరాలు చేధించగలిగితే లక్ష కెమెరాలు ఉంటే నేరగాళ్లు ఎవరూ తప్పించుకోలేరని, తప్పు చేయాలంటే భయపడతారనే ఉద్దేశంతో వీటిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు పోలీసు శాఖ సన్నద్ధమవుతోంది. భవిష్యత్తులో వాటన్నింటిలోనూ నేరగాళ్ల ముఖాలను గుర్తించే వ్యవస్థనూ పెట్టనుంది. మొత్తం సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయ్యాక వాటి దృశ్యాలను విశ్లేషించి ఏయే ప్రాంతాల్లో ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి? వాటి నియంత్రణకు ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై పోలీసుశాఖ ట్రెండ్ అండ్ సెంటిమెంటల్ విశ్లేషణ చేయనుంది.
''రాష్ట్రంలో ఏ ప్రాంతంలో సీసీ కెమెరాలు అవసరమవుతాయో అన్ని చోట్లా వీటిని ఏర్పాటు చేయాలి. కృష్ణా జిల్లా కంకిపాడులో బైక్‌ల చోరీ కేసులో సీసీ కెమెరాల్లో దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అతని వద్ద 20 లక్షల విలువైన 38 వాహనాల్ని స్వాధీనం చేసుకున్నాం. లక్ష కెమెరాలు ఉంటే నేరగాళ్లు ఎవరూ తప్పించుకోలేరని, తప్పు చేయాలంటే భయపడతారనే ఉద్దేశంతో వీటిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయనున్నాం''-ద్వారకా తిరుమలరావు , డీజీపీ
పవన్ టూర్లో ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ హల్ చల్
సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్‌లాల్ - ఏపీలో 16 మంది ఐపీఎస్‌ల బదిలీ - IPS TRANSFERS IN ANDHRA PRADESH