Padma Awards 2025 : కేంద్ర ప్రభుత్వం అందించే అత్యున్నత గౌరవ పురస్కారం భారతరత్న. ఆ తర్వాత స్థాయిలో వరుసగా పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటిస్తుంది. కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడలు, సామాజిక సేవ, సైన్స్, ఇంజినీరింగ్, ప్రజా వ్యవహారాలు వంటి విభాగాల్లో అసాధారణ ప్రతిభ, విజయాలు, సేవలు అందించిన వ్యక్తులకు వీటిని అందిస్తారు. ఆయా వ్యక్తులకు రాష్ట్రపతి సంతకం చేసిన సర్టిఫికెట్, మెడల్ ప్రదానం చేస్తారు.
మీరు తెస్తున్న చికెన్ మంచిదేనా? - తాజా, కల్తీ మాంసం ఎలా గుర్తించాలంటే!
139మందికి పద్మ పురస్కారాలు :
భారత ప్రభుత్వం 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మొత్తం 139మందికి 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని గుర్తించి ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ ప్రకటించింది. వీరిలో ప్రముఖ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించగా, మందకృష్ణ మాదిగ, మిరియాల అప్పారావు, కె.ఎల్.కృష్ణ, మాడుగుల నాగఫణిశర్మ, పంచముఖి రాఘవాచార్య పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. వీరంతా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు.
పద్మ పురస్కారాలు అందుకున్న వారికి ఎలాంటి ప్రత్యేక వసతులు, నగదు బహుమతి ఉంటాయో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. వాస్తవం ఏమిటంటే పద్మ పురస్కారాలకు ఎంపికైన, లేదా అందుకున్న వారికి ఎలాంటి నగదు బహుమతి ఉండదు. అలవెన్సులు, రైలు/విమాన ప్రయాణాల్లో ప్రత్యేక రాయితీలు కూడా ఉండవు. అంతే కాదు తమ పేరు ముందు, వెనుక ఈ బిరుదును కూడా ఉపయోగించుకునేందుకు వీల్లేదు. ఒకవేళ పురస్కార గ్రహీతపై అభియోగాలు వచ్చినా, పురస్కారం దుర్వినియోగం జరిగినా ప్రభుత్వం వెనక్కుతీసుకునే అవకాశం ఉంది.
ఆ స్వామి విగ్రహం నిలువెల్లా విషం - తొడ భాగంలో విభూతి పంపిణీ
నగదు బహుమతి ప్రకటించే అవకాశం
భారత ప్రభుత్వం అందించే పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి కేంద్రం ఎలాంటి నగదు బహుమతి అందించదు. ఈ గౌరవప్రదమైన పురస్కారం పతకం రూపంలోనే ఉంటుంది. కేవలం సర్టిఫికెట్, పతకం మాత్రమే రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకుంటారు. అయితే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించే వీలుంది. నగదు బహుమతి లేదా ఇతర ప్రోత్సాహకాలు ప్రకటించుకోవచ్చు. గత సంవత్సరం పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. ప్రతి నెలా రూ.25వేల పెన్షన్ కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఇక వివిధ విభాగాల నుంచి అందించే పురస్కారాలేమిటో తెలుసా?
ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి :
యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి 'పరమ వీర చక్ర' అత్యున్నత పురస్కారం కాగా, ఆ తర్వాత మహా వీర చక్ర, వీర చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర అనే పురస్కారాలను అందిస్తారు.
క్రీడల్లో రాణించిన వారికి, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులు అందిస్తారు. వైద్య రంగంలో విశేష సేవలకు డాక్టర్ బీసీ రాయ్ పురస్కారం ప్రదానం చేస్తారు. విశేష ప్రతిభ కలిగిన మహిళలకు నారీ శక్తి పురస్కారం, చిన్నారులకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అందుతుంది. సాహిత్యంలో జ్ఞానపీఠ్ అత్యున్నత పురస్కారం. ధైర్య సాహసాలు ప్రదర్శించిన పోలీసులకు రాష్ట్రపతి పోలీసు పతకం ప్రదానం చేస్తారు.
అర్జున అవార్డు గ్రహీతలకు రూ.15 లక్షల నగదు బహుమతి, అర్జునుడి కాంస్య విగ్రహం, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీతలకు రూ.11 లక్షల నగదు బహుమతి, వాగ్దేవి (సరస్వతీ దేవి) కాంస్య విగ్రహంతో పాటు ప్రశంసా పత్రాలు అందిస్తారు. నారీ శక్తి పురస్కారం గ్రహీతలకు రూ.2 లక్షల నగదు, బాల పురస్కార్ అందుకున్న వారికి లక్ష రూపాయల నగదు బహుమతి అందిస్తారు.
మీ హైట్ ఏంటి, వెయిట్ ఏంటి? - ఎవరెంత బరువుండాలో ఈ ఫార్ములాతో తెలుసుకోండి!
రాత్రిళ్లు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? - వాటి అరుపుల వెనుక కారణాలేంటో తెలుసా?