Hero Nandamuri Balakrishna Biography : ఎన్టీఆర్ తెలుగు తెర ఇలవేల్పు. ఆయన వారసుడిగా ఆ మహానటుడి వెలుగులకు మరిన్ని హంగులు జోడించిన ఘనత బాలకృష్ణ సొంతం. తండ్రి చాటు కుమారుడిగానే కెమెరా ముందుకొచ్చినా ఆ తర్వాత తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. 50 ఏళ్లుగా ఆ బాల గోపాలాన్ని అలరిస్తూ దిగ్విజయంగా తన నట ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ. ఇప్పుడాయన ‘పద్మభూషణ్’ నందమూరి బాలకృష్ణ.
నట ప్రయాణంలో 50 ఏళ్లు పూర్తి : నటసింహం నందమూరి బాలకృష్ణను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పురస్కారాల్లో కళల విభాగంలో ఏపీ నుంచి ఆయన్ని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్రం ప్రకటించింది. నటుడిగా ఆయన చాటుతున్న ప్రతిభ, రాజకీయ నాయకుడిగా, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్‌గా ఆయన సమాజానికి అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని తెలిపింది. అందుకే భారత ప్రభుత్వం అందిస్తున్న మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్‌తో సత్కరించినట్లు వెల్లడించింది. నందమూరి బాలకృష్ణ నట ప్రయాణానికి గతేడాదే 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన నట ప్రయాణం స్వర్ణోత్సవంతో వరుస విజయాలతో సందడి సాగుతున్న వేళ బాలకృష్ణ పద్మభూషణుడు కావడం అభిమానుల్లో మరింత జోష్‌ని పెంచింది.
తెరపై తనదైన ముద్ర : బాలకృష్ణ ప్రయాణం ‘తాతమ్మ కల’తో మొదలైనా హీరోగా ఆయన పూర్తిస్థాయి ప్రయాణం ‘సాహసమే జీవితం’తో మొదలైంది. ‘మంగమ్మగారి మనవడు’, ‘కథానాయకుడు’, ‘భలే తమ్ముడు’, ‘పట్టాభిషేకం’, ‘నిప్పులాంటి మనిషి’, ‘ముద్దులక్రిష్ణయ్య’, ‘అనసూయమ్మగారి అల్లుడు’, దేశోద్ధారకుడు’, ‘భలే దొంగ’, ‘ముద్దుల మావయ్య’ తదితర చిత్రాలతో ఎన్టీఆర్ తనయుడిగానే కాకుండా, బాలకృష్ణగా తెరపై తనదైన ముద్ర వేశారు. ‘నారీ నారీ నడుమ మురారి’, ‘ముద్దుల మేనల్లుడు’, ‘లారీ డ్రైవర్’ తదితర చిత్రాలతో ఆయన తిరుగులేని స్టార్‌గా అవతరించారు.
సినీ పరిశ్రమకు కొత్తదారి : ఒకపక్క సాంఘిక చిత్రాలు చేస్తూనే మరోవైపు తండ్రి ఎన్టీఆర్ అడుగు జాడల్లో నడుస్తూ ఆరంభం నుంచే పౌరాణిక పాత్రల్లో మెరిశారు బాలకృష్ణ. తండ్రిబాటలో నడిచే బాలకృష్ణ దినచర్య తెల్లవారు జామున 3 గంటలకే మొదలైపోతుంది. ‘ఆదిత్య 369’తో ఆయన ప్రయోగాల పరంపరకి తెర లేచింది. అందులో శ్రీకృష్ణ దేవరాయలుగా చారిత్రక పాత్రని పోషించి మెప్పించారు. ఒకవైపు మాస్ కథల్లో ఒదిగిపోతూనే అవకాశం వచ్చిన ప్రతిసారీ కొత్త రకమైన పాత్రల్ని భుజాన వేసుకుంటూ తన నటనలో వైవిధ్యం ప్రదర్శించారు బాలకృష్ణ. ‘భైరవద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’ ఇలా జానపద కథలు, పౌరాణికాలు, మరోవైపు మాస్ కథలు అసలు ఇలా బాలకృష్ణ చేయని జానర్ అంటూ లేదు అనిపించారు. ఒకే రకమైన యాక్షన్ కథలతో పరిశ్రమ మూసదారిలో వెళుతున్న దశలో ఫ్యాక్షన్ కథలతో కొత్తదారి చూపించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది.
ఒకే చిత్రంలో 60 పాత్రలు : ఆయన ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ చిత్రాలు చేశాక ఆ దారిలో తెలుగులో ఎన్నో ఫ్యాక్షన్ కథా చిత్రాలు రూపొందాయి. ‘సింహా’, ‘లెజెండ్’, ‘డిక్టేటర్’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తదితర చిత్రాలతో కొత్తతరాన్నీ అలరించారు. తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌గా రూపొందిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాల్లో 60కిపైగా గెటప్పుల్లో కనిపించి, తెలుగు ప్రజల ఆరాధ్యనటుడైన ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించారు. ఆరు పదుల వయసులోనూ ఆయన జోరు ప్రదర్శిస్తున్నారు. ‘అఖండ’ నుంచి ఆయన జైత్రయాత్ర కొనసాగుతోంది. ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ చిత్రాలతో వరుస విజయాల్ని సొంతం చేసుకున్నారు. తన వందో చిత్రంగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’చేసిన ఆయన, ప్రస్తుతం 110వ చిత్రం ‘అఖండ2: తాండవం’లో నటిస్తున్నారు. ఓటీటీ వేదికలతోనూ తనదైన శైలిలో సందడి చేస్తున్నారు. ఆయన చేసిన ‘అన్‌స్టాపబుల్’బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది. తన తనయుడు మోక్షజ్ఞనీ తెరకు పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
రాజకీయాల్లో తనదైన ముద్ర : నటుడిగానే కాకుండా ప్రజానాయకుడిగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు బాలకృష్ణ. తన తండ్రి ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గానికి సేవలందిస్తున్నారు. తన తండ్రి స్థాపించిన బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన నిత్యం ఆస్పత్రిలో అందుతున్న సేవల్ని పర్యవేక్షిస్తూ ఎంతోమందికి ఉచితవైద్యం అందేలా కృషి చేస్తున్నారు.