Etikoppaka Toys in Republic Day : ఏటికొప్పాక బొమ్మలు మన రాష్ట్ర కీర్తి కిరీటంలోని ఓ కలికితురాయి వంటివి. మామూలు కర్రతో తయారు చేసే ఈ బొమ్మలు దేశవిదేశాల్లోనూ ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకతను సగర్వంగా చాటిచెబుతున్నాయి. ఎటు చూసినా నునుపుగా ఉండే ఈ కళాకండాలు ఎన్నో ఏళ్లుగా చిన్నారుల చేతుల్లో ఆటవస్తువుల్లా మారి మురిసిపోతున్నాయి. చివరికి దేశ ప్రధాని మోదీని సైతం మైమరిపించాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ బొమ్మలు గణతంత్ర దినోత్సవం నాడు శకట రూపంలో దర్శనమివ్వనున్న నేపథ్యంలో ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
చూడముచ్చటగా, మనసుని కట్టిపడేస్తున్న ఈ బొమ్మలు చూశారా ఇవీ మన ఆంధ్రప్రదేశ్ గర్వం. జీఐ ట్యాగ్ సంపాదించిన ఈ బొమ్మలను అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామస్థులు గత 400 ఏళ్లగా తయారు చేస్తున్నారు. వంట చేసేందుకు కూడా పనికిరాని అంకుడు కర్రతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. సూది మొన పరిమాణం గల బొమ్మలను సైతం సులువుగా చెక్కడాన్ని చూసి ఎవరైనా సరే ఔరా అనాల్సిందే. ఈ కళాకారుల ప్రతిభ గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తోంది.
కళాకారుల ప్రతిభకు తార్కాణం : వరహ నది తీరంలో ఉన్న ఈ గ్రామస్థలంతా లక్క, అంకుడు కర్రతో చేసిన బొమ్మలపై వచ్చే సొమ్ముతోనే జీవనం సాగిస్తున్నారు. అంకుడు కర్రని సేకరించి చిన్న చిన్న ముక్కలుగా కోస్తారు. ఆ తర్వాత బొమ్మకు కావాల్సిన ఆకృతిలో చెక్కి సహజసిద్ధమైన రంగులతో ప్రాణం పోస్తున్నారు. పిల్లలు ఆడుకునేందుకు పెళ్లికూతురు బొమ్మల నుంచి అల్మరాలో పెట్టుకునే రాణి రుద్రమదేవి, హరిదాసుల వరకు అన్ని రకాలు తయారు చేయడం ఈ ఏటికొప్పాక గ్రామస్థుల ప్రత్యేకత. ఈ బొమ్మల్లో ఎక్కడా పదునైన అంచులు లేకుండా ఎక్కడ పట్టుకున్న గుండ్రంగా, నునుపుగా ఉండేలా తయారు చేయడం ఈ కళాకారుల ప్రతిభకు తార్కాణంగా నిలుస్తోంది.
ఈ అందమైన కళాకండాలు ప్రధాని మోదీ మనసును సైతం దోచాయి. మన్‌కీ బాత్‌లో మాట్లాడిన మోదీ పిల్లలకు ఎలాంటి గాయాలు కాకుండా ఉండేలా ఈ బొమ్మలు తయారు చేస్తున్నారని తెలిపారు. వీటి అభివృద్ధి కోసం సి.వి.రాజు అనే వ్యక్తి ఓ కొత్త ఉద్యమం చేపట్టి మరింత నైపుణ్యంతో తయారుచేసి పూర్వవైభవం తెచ్చారని కొనియాడారు. దేశ విదేశాలకు కూడా ఈ బొమ్మలను ఎగుమతి చేస్తున్నారు. ప్రధాని ప్రస్తావించడం వల్ల వీటికి కొంతమేర డిమాండ్ పెరిగిందని తయారీదారులు చెబుతున్నారు.
"మేము బొమ్మలను తయారుచేస్తాం. ఆర్డర్లపై తయారుచేసి ఇస్తాం. ఆదాయం తక్కువ వచ్చినా హస్తకళలలను బతికించాలనే ఉద్దేశంతో వీటిని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇతర దేశాల్లోనూ వీటికి డిమాండ్ ఉంది. దేశ విదేశాలకు కూడా ఈ బొమ్మలను ఎగుమతి చేస్తున్నాం. ప్రభుత్వం సహాయం చేస్తే మాకు కొంత అండగా ఉంటుంది." - తయారీదారులు
Special Story on Etikoppaka Toys : బొమ్మలకు ప్రాణం పోస్తున్న ఈ కళాకారుల జీవితాల్లో మాత్రం వెలుగులు ఉండటం లేదు. తయారీకి వాడే అంకుడు కర్రపై నిషేధం విధించారు. దానిని ఎత్తివేసి సబ్సిడీపై కర్రని ఇప్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్ఠలు సంపాదించిన ఈ బొమ్మలు మరోమారు అందరి దృష్టిని ఆకర్షించాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఏటికొప్పాక బొమ్మలతో ఆంధ్రప్రదేశ్ ఠీవీ ప్రదర్శితమవబోతుంది.
అంకుడు కర్రలకు లైన్ క్లియర్ - ఆ చెట్లు పెంచడానికి ప్రణాళికలు సిద్ధం
ఏటికొప్పాకలో బొమ్మల స్టాల్స్.. 'ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి' వేగవంతం