Alliance Candidates Competition for MLA Quota MLC Seats: రాష్ట్రంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ముగియక ముందే 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావటం ఆశావహుల జోరు ఊపందుకుంది. ఈ ఖాళీలకు అదనంగా వైఎస్సార్సీపీలో ఇమడలేం అంటూ ఇప్పటికే మరో నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేయటంతో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు ఎక్కువ మందే పోటీ పడుతున్నారు. జనసేన నుంచి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినందున ఆ పార్టీ నుంచి నాగబాబు ఎమ్మెల్సీ బెర్తు ఖరారైపోయింది.
మిగిలిన నాలుగింటిలో తెలుగుదేశం నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే కోటా ఖాళీల్లో అవకాశం దక్కకపోయినా రాజీనామాలు ఆమోదం పొందాక వచ్చే అవకాశాల్లోనో లేక తదుపరి అవకాశాల్లోనైనా రేసులో నిలిచేందుకు ఇప్పటి నుంచే పోటీలో నిలిచేందుకు యత్నిస్తున్నారు. అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లను అసెంబ్లీ సమావేశాల సమయంలో కొందరు ఒక్కొక్కరుగా వెళ్లి ప్రసన్నం చేసుకునే యత్నాలు చేస్తున్నారు.
5 ఖాళీలూ కూటమికే ఏకగ్రీవం: తెలుగుదేశం ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుడుల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. ఈ లోగా కొత్త నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 20వ తేదీన పోలింగ్ జరగాల్సి ఉన్నా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి సభలో సభ్యుల సంఖ్యాబలం ఆధారంగా వీటి భర్తీ జరగనున్నందున 5 ఖాళీలూ కూటమి ఖాతాలోకే ఏకగ్రీవం కానున్నాయి. ఖాళీ అవుతున్న 5 స్థానాల్లో ఎవరికైనా తిరిగి కొనసాగింపు ఇస్తారా లేదా అనే స్పష్టత లేకపోవటంతో ఎక్కువ మంది కొత్త ఆశావహులు చోటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు - ప్రజలు ఆ అవకాశం ఇవ్వలేదు : పవన్ కల్యాణ్
పోరాటం చేసినా పదవి దక్కని ఆశావహులు వీరే:
- 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అర్హత ఉన్నప్పటికీ పొత్తు సర్దుబాటు, వివిధ కారణాల వల్ల సీటు దక్కించుకోలేకపోయిన వారికి ఎమ్మెల్సీలుగా ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకూ ఇచ్చిన నామినేటెడ్ పదవులు, టీటీడీ పాలక మండలిలో చోటు దక్కని వారి జాబితాను పరిశీలిస్తే పీఠాపురం టీడీపీ నేత వర్మ, మాజీమంత్రులు జవహర్, దేవినేని ఉమా, వంగవీటి రాధ, రెడ్డి సుబ్రహ్మణ్యం, గన్ని వీరాంజనేయులు, తిప్పేస్వామి, నల్లపాటి రాము, ప్రభాకర్ చౌదరి, కొమ్మాలపాటి శ్రీధర్ తదితరులు ఉన్నారు.
- గత 5 ఏళ్ల ప్రతిపక్షంలో ఎమ్మెల్సీలు నారా లోకేశ్ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై శాసనమండలిలో గట్టి పోరాటం చేసిన వారినీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ జాబితాలో మంతెన సత్యనారాయణ రాజు, బీదా రవిచంద్ర యాదవ్, టీడీ జనార్థన్, బుద్ధా వెంకన్న, అంగర రామ్మోహన్ తదితరులు ఉన్నారు.
- రాజధాని అమరావతిని విచ్ఛినం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రాజధానుల బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందకుండా క్లిష్ట సమయంలో వీరు గట్టిగా నిలబడ్డారు. డొక్కా మాణిక్య వరప్రసాద్, పోతుల సునీత లాంటి వారు క్లిష్టసమయంలో పార్టీని వదిలినా ఎలాంటి ఒత్తిళ్లకూ లొంగకుండా పార్టీ కోసం ఆ సమయంలో వీరు గట్టిగా నిలబడ్డారు.
- జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించినప్పుడు బుద్ధా వెంకన్న గేటు వద్ద నిలువరించే ప్రయత్నం చేశారు.
- మండలిలో ఒకానొక దశలో నాటి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సభలో ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేశ్‌పై దాడికి యత్నిస్తే అతన్ని మంతెన సత్యనారాయణ రాజు, బీదా రవిచంద్ర యాదవ్‌లు ప్రతిఘటించి ఎదురు దాడికి సైతం తెగించారు.
ఆశతో ఉన్న కొత్తగా పార్టీలోకి వచ్చిన సభ్యులు: ఎమ్మెల్సీలుగా తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ మరికొంతమంది ఆశావహలూ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో కీలకంగా ఉన్న సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు, ముస్లింకు చట్టసభలో ప్రాతినిధ్యం లేనందున తనకు అవకాశం కల్పించాలని నాగుల్ మీరా, న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశంలోకి వచ్చిన మోపిదేవి వెంకటరమణరావు, మద్దిపట్ల సూర్యప్రకాష్లు తమకు అవకాశం దక్కుతుందనే ఆశతో ఉన్నారు. నామినేటెడ్ పదవిలో చోటు దక్కినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల జీవో ఆగిన పీతల సుజాత పేరును ఎమ్మెల్సీ జాబితాలో పరిగణనలోకి తీసుకుంటారేమో వేచి చూడాలి.
వైఎస్సార్సీపీలో ఉండలేమంటూ పార్టీకి, ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణలు రాజీనామాలు చేశారు. వీరు రాజీనామాలు చేసి నెలలు దాటుతున్నా మండలి ఛైర్మన్ ఇంతవరకూ ఆమోదించకపోవటం వివాదాస్పదమవుతోంది. రాజీనామాల ఆమోదంపై ఇదే ధోరణి కొనసాగితే ఇప్పటికే రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీలతో పాటు వైఎస్సార్సీపీలో ఉన్న మరికొందరు అసంతృప్త ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టే ఆలోచనా చేస్తున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా తమకు ఒక ఎమ్మెల్సీ స్థానం అయినా కేటాయించాలని బీజేపీ నేతలు కోరుతున్నారు.