Kala Jyothsna Excelling in Taekwondo : ఆ యువతికి చిన్నప్పటి నుంచి ఆత్మరక్షణ విద్యలంటే మక్కువ. అదేవిషయం తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లూ ఆడపిల్లలకు ఆటలేంటి అనకుండా తైక్వాండోలో శిక్షణ ఇప్పించారు. ఆసక్తితో పాటు కఠోర శ్రమతో అందులో రాణించి జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. భవిష్యత్లో అంతర్జాతీయ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఆ క్రీడాకుసుమం ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.
తనను తాను రక్షించుకోవాల్సి వచ్చినప్పుడు ఒకరిపై ఆధారపడకూడదనేది ఆమె తల్లి ఆలోచన. అందుకే చిన్నతనం నుంచే కరాటే వంటి ఆత్మరక్షణ విద్యలు నేర్పించాలని భావించారా తల్లిదండ్రులు. ఫలితంగా రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాధించి ఇప్పుడు అందరి మన్నలు అందుకుంటోన్న యువతి స్టోరీ ఇది. కాలేజీ క్యాంపస్‌లో మిత్రులతో సరదాగా తిరుగుతున్న ఈ అమ్మాయి పేరు కళా జ్యోష్ణ. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహేశ్వరరెడ్డి, గురుదేవి దంపతుల కుమార్తె.
గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో కళా జ్యోష్ణ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. తల్లిదండ్రుల ఆశయం మేరకు తైక్వాండోలో మెళకువలు నేర్చుకొని ఔరా అనిపిస్తోంది. ఆమె 12 ఏళ్ల వయసులోనే జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో పతకాలు సాధించింది. అదే ప్రతిభతో జాతీయ స్థాయి తైక్వాండో క్రీడాకారిణిగా ఎదిగింది. పుదుచ్చేరిలో జరిగిన ఖేలో ఇండియా మహిళల లీగ్ విభాగంలో రజతం, చెన్నైలో జరిగిన సౌత్ జోన్ తైక్వాండోలో స్వర్ణం సాధించింది.
Proddatur Girl Excelling Taekwondo : చిన్నతనం నుంచే తల్లిదండ్రుల ప్రోత్సహించడంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయాలు సాధించానని చెబుతోంది కళా జ్యోష్ణ. ప్రస్తుతకాలంలో ఆత్మరక్షణ అనేది అమ్మాయిలకు చాలా ముఖ్యమంటోంది. శారీరక వ్యాయమం ఉంటే తైక్వాండోలో రాణించవచ్చని చెబుతోంది. చదువులో సైతం ప్రతిభ చూపుతోంది. ఈ ఆట ద్వారా శారీరకబలం పెరిగిందని మానసికంగా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా పోయాయని తెలిపింది. తైక్వాండోలో ఆమె చూపిన ప్రతిభ ఆధారంగా క్రీడాకారుల కోటాలో యూనివర్సిటీ యాజమాన్యం ఫీజులో రాయితీ ఇచ్చి సీటును కేటాయించింది.
"ఆత్మరక్షణ అనేది అమ్మాయిలకు చాల ముఖ్యం. మా అమ్మ ప్రోత్సాహంతో తైక్వాండోలో రాణిస్తున్నాను. అలా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించాను. ఈ ఆట ద్వారా శారీరకబలం పెరిగిందని మానసికంగా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా పోయాయి." - కళా జ్యోష్ణ, తైక్వాండో క్రీడాకారిణి
యూనివర్సిటీ కోచ్‌ల ద్వారా ప్రస్తుతం కళా జ్యోష్ణకు శిక్షణ ఇప్పిస్తున్నారు. తనూ తైక్వాండోలో దేశానికి ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనటమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. క్రమం తప్పకుండా సాధన చేయడంతో పాటు పతకాలు సాధించాలనే తపన వల్లే జ్యోష్ణ ఈ స్థాయికి ఎదిగిందని శిక్షకులు చెబుతున్నారు. మన దేశంలో ఉత్తరాది రాష్ట్రాల వారే ఈ తరహా క్రీడల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. అందుకు భిన్నంగా కళా జ్యోష్ణ ఏపీ నుంచి జాతీయస్థాయిలో తైక్వాండో పోటీల్లో రాణిస్తుండటం విశేషం అంటున్నారు తన కోచ్‌లు, సన్నిహితులు.