AP MLC Elections 2025 : ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా- గుంటూరు జిల్లాలు మరికొన్ని గంటల్లో పోలింగ్‌కు సిద్ధమవ్వనున్నాయి. ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక హోరాహోరీగా సాగనుంది. 22,493 ఓట్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ ఏపీటీఎఫ్ నుంచి పాకలపాటి రఘువర్మ, పీఆర్టీయూ నుంచి గాదె శ్రీనివాసులునాయుడు, యూటీఎఫ్ కోరెడ్ల విజయగౌరి మధ్య నెలకొంది.
గోదావరి జిల్లాల్లో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా సాగనుంది. 3,14,984 మంది ఓటర్లు ఉన్న ఈ ఎన్నికల్లో ప్రధానంగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి డీవీ రాఘవులు మధ్య పోటీ నెలకొంది. కృష్ణా- గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నువ్వా నేనా అన్నట్లు సాగనుంది. 3,47,116 ఓట్లు ఉన్న ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు, కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మధ్య నెలకొంది.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఉమ్మడి విజయనగరం జిల్లావ్యాప్తంగా మొత్తం 29 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణకు సుమారు 175 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. విజయనగరం ఆర్డీఓ కీర్తి ఆధ్వర్యంలో, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని తరలించారు. గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నిక కోసం ఏలూరు జిల్లాలో మొత్తం 66 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
MLC Elections in AP 2025 : జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో 23 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఏలూరు గిరిజన భవన్‌లో ఏర్పాటు చేసిన సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల అధికారి, కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటింగ్ ప్రక్రియను వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. కృష్ణా- గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కృష్ణా జిల్లాలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
ఉయ్యూరు, గుడివాడ డివిజన్‌లో పోలింగ్‌కు సంబంధించి సామగ్రి పంపిణీని పరిశీలించిన కలెక్టర్ బాలాజీ సిబ్బందికి ఎన్నికల నిబంధనలు, ప్రక్రియను వివరించారు. సున్నిత ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా 112 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. విజయవాడ సబ్ కలెక్టరేట్‌లో సిబ్బందికి ఎన్నికల సామగ్రి అందించిన కలెక్టర్ లక్ష్మీశా పోలింగ్ ప్రక్రియకు సంబంధించి పలు సూచనలు చేశారు.
నందిగామ డివిజన్‌లో పోలింగ్ కోసం 22 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పట్టభద్రుల ఎన్నికకు గుంటూరు జిల్లావ్యాప్తంగా 483 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2500 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ నెల27న పట్టభద్రుల ఎన్నిక పోలింగ్ - ఎమ్మెల్సీ ఓటు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!