Instant Dosa Recipe : ఎక్కువ మంది రోడ్ సైడ్ ఫుడ్ ఇష్ట పడేందుకు సమయాభావం, రుచి ప్రధాన కారణాలు. స్నాక్స్, టిఫిన్స్ ఇంట్లో చేయాలంటే ముందు రోజే నానబెట్టాల్సి రావడం, గంటలకొద్దీ ప్రాసెస్ ఉంటుంది. గంటల కొద్ది నానబెట్టి, మిక్సీపట్టి టిఫిన్లు చేయాలంటే కాస్త కష్టమే. ఓపిక కూడా ఉండాలి. అందుకే చాలా మంది ఇన్స్టెంట్ రెసిపీలు ట్రై చేస్తుంటారు.
హోటల్ స్టైల్ "పూరీ కర్రీ" సీక్రెట్ ఇదే! - 'ఆ ఒక్కటి' వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది!
ఇంట్లో అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించినా, ఉదయం పిల్లల స్కూల్ టైంలో లేదా సాయత్రం స్నాక్స్ గా ఏదైనా తినాలనిపించినా ఇలాంటి ఇన్స్టెంట్ దోసె వేసుకుంటే చాలు! ఇంట్లో ఉన్న వాటితోనే పదే పది నిమిషాల్లో స్పాంజ్ దోశ వేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. దీనిని బబుల్ దోసె అని కూడా అనొచ్చు. ఎందుకంటే పెనంపై వేసి వేడి చేయగానే దోసెపై ఏర్పడే బబుల్స్ మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి.
బబుల్ దోసె తయారీకి మినప్పప్పు అవసరం లేదు. బియ్యం నానబెట్టుకోవాల్సిన పన్లేదు. ఓ పది నిమిషాల ముందు అన్నీ సిద్ధం చేసుకుంటే సరిపోతుంది. ఇవి చాలా స్పంజీగా దూదిలాగా ఉంటాయి.
ఇన్స్టెంట్ దోసె తయారీకి కావాల్సిన పదార్థాలు
- అటుకులు - 1 కప్పు
- ఉప్మా రవ్వ - 1 కప్పు
- చిలికిన పెరుగు - 1 కప్పు
- మెంతులు - 1 స్పూన్
- జిలకర పొడి - కొద్దిగా
- ఉప్పు - రుచికి సరిపడా
- వంట సోడా - పావు టీ స్పూన్
- నూనె - కాల్చుకోవడానికి సరిపడా

తయారీ విధానం
- ముందుగా ఓ గిన్నెలోకి అటుకులు వేసుకుని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
- ఆ తర్వాత శుభ్రం చేసుకున్న అటుకుల్లో ఉప్మా రవ్వ, చిలికిన పెరుగు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని ఓ పది నిమిషాల పాటు మారినేట్ చేసుకోవాలి.
- పది నిమిషాల తర్వాత మిశ్రమం గట్టి పడుతుంది.
- దానిని మిక్సీ జార్ లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని దోసె పిండి మాదిరిగా చేసుకుంటే సరిపోతుంది.
- దోసె పిండి మిశ్రమంలోకి రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ వంట సోడా కలుపుకోవాలి.
- దోసె పాన్ పెట్టుకుని సెట్ దోసె మాదిరిగా కొద్దిగా మందంగా వేసుకుని కాల్చుకోవాలి. ఈ సమయంలో దోసెలో బబుల్స్ చూడ ముచ్చటగా కనిపిస్తాయి. ఓ వైపు కాలిన దోసెను రెండు వైపులా కాల్చుకుని తీసుకుంటే సరిపోతుంది.
- పల్లీ చట్నీలో లేదంటే ఏదైనా చట్నీలోకి తింటే రుచి చాలా బాగుంటుంది.
పూరీలు నూనె పీల్చకుండా పొంగాలంటే పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు! - సింపుల్ ట్రిక్
గంటల కొద్ది మెత్తగా ఉండే "సొరకాయ చపాతీ" - మీ పిల్లలు ఒక్కటి కూడా మిగల్చరు!