తెలంగాణ

telangana

ETV Bharat / state

రామగుండంలో మరో 1300 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధం - నేడు స్థలాల పరిశీలన - Ministers Visit for Power Plant

Site Inspection for Thermal Power Plant : మాంచెస్టర్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన రామగుండంలో మరో 1300 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. ప్రాజెక్టుల స్థలాలను ఇవాళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు పరిశీలించనున్నారు. జెన్‌కో థర్మల్‌-బి పవర్‌ స్టేషన్ స్థానంలో సింగరేణి ఆధ్వర్యంలో సూపర్ క్రిటికల్‌ ప్లాంటును స్థాపిస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఆ క్రమంలో మంత్రులు స్థల పరిశీలన చేయనున్నారు.

BHATTI SITE VISIT FOR POWER PLANT
Site Inspection for Thermal Power Plant (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 7:42 AM IST

Updated : Aug 31, 2024, 8:47 AM IST

Ministers Site Inspection in Ramagundam for Power Plant :పెద్దపల్లి జిల్లా రామగుండంలో 800 మెగా వాట్ల ప్లాంట్ నిర్మాణ పనులను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెట్‌కు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. జెన్‌కో ద్వారా ప్రతిపాదిత విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించడం ద్వారా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడంతో పాటు దాదాపు 2500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని జేఏసీ నాయకులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రజలకు తక్కువ ధరకు విద్యుత్‌ అందుతుందని వారు తెలిపారు.

దశాబ్దాల చరిత్ర కలిగి ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి వెలుగులు పంచిన 62.5 మెగావాట్ల రామగుండం-బి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం మూతపడే పరిస్థితి నెలకొంది. బి-థర్మల్‌ ప్లాంట్‌ను నెలకొల్పిన 13 ఏళ్ల తర్వాత దీని సరిహద్దును ఆనుకొనే 1978లో కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీకి పునాది రాయి వేసింది. 1983లో కేవలం 200 మెగా వాట్ల సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభించిన కార్పొరేషన్‌, దశలవారీ విస్తరణతో ప్రస్తుతం 2600 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుని దక్షిణ భారతదేశం మొత్తానికి వెలుగులు పంచుతోంది. అయితే బి-థర్మల్‌ ప్రాజెక్టు జీవిత కాలం 50 ఏళ్లు, కానీ ప్లాంట్‌ ఏర్పాటు చేసి 59 ఏళ్లు కావడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి.

ప్లాంటు నిర్వహణ భారంగా మారింది. తాజాగా యూనిట్‌ ట్రిప్‌ అయ్యి విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదాయం కన్నా వ్యయమే అధికంగా ఉండటంతో మూసివేయాలనే సర్కారు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే అదే స్థానంలో 800 మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యం ఉన్న కొత్త ప్లాంటును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా పునర్విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీలో కొత్తగా నిర్మించాల్సిన 800 మెగా వాట్ల మూడు యూనిట్లను కూడా ప్రభుత్వం కొనసాగించనున్నట్లు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ ఠాకూర్ తెలిపారు. ఆ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నేడు రామగుండంలో పర్యటించనున్నారని చెప్పారు.

'ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, దానితో పాటు 500 మెగా వాట్ల పైలట్​ ప్రాజెక్టు చేపట్టాలని చూస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది' - మక్కాన్‌సింగ్‌ ఠాకూర్, రామగుండం ఎమ్మెల్యే

నెలకొల్పనున్న జలవిద్యుత్‌ ప్లాంట్ : మరోవైపు జల విద్యుత్‌ రంగంలోకి సింగరేణి అడుగు పెట్టబోతోంది. రూ.3 వేల కోట్ల బడ్జెట్‌తో 500 మెగా వాట్ల పంప్‌డ్‌ స్టోరేజీ జల విద్యుత్‌ ప్లాంట్ నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. డీపీఆర్​ సమర్పించే బాధ్యతల్ని టాటా కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించారు. సాధ్యాసాధ్యాలను పూర్తి స్థాయిలో పరిశీలించి డీపీఆర్‌, సింగరేణికి అందజేసినట్లు సమాచారం. శ్రీశైలం తరహాలో జలవిద్యుత్‌ ఉత్పత్తి చేయాలని సింగరేణి నిర్ణయించింది. దీని కోసం రామగుండం డివిజన్‌ పరిధిలోని మూసివేసిన మేడిపల్లి ఓసీపీని ఎంపిక చేసింది. భారీ పంపుల సహాయంతో నీటిని పైకి పంపించి, కిందకు వదలడం ద్వారా జల విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకొంది.

మేడిపల్లి ఓసీపీలో బొగ్గు నిల్వల వెలికితీత పూర్తి అయ్యింది. మూసివేసిన క్వారీని జల విద్యుత్‌ కోసం ఎంపిక చేశారు. ఇందులో ప్రస్తుతం 0.5 టీఎంసీ నీరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉదయం సోలార్‌ విద్యుత్‌ను వినియోగించి భారీ మోటార్ల సహాయంతో క్వారీలోని నీటిని పైకి పంపింగ్ చేస్తారు. రాత్రిపూట అదే నీటిని దిగువకు వదులుతారు. జల ప్రవాహంతో భారీ టర్బైన్ల సాయంతో జల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల రామగుండం ప్రాంతంలో భారీగా ఉద్యోగావకాశాలు కలిగే అవకాశం ఉందని సింగరేణి అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్న దృష్ట్యా, స్థల పరిశీలన పూర్తైతే పనులు వేగంగా ప్రారంభం అవుతాయని ఈ ప్రాంతవాసులు భావిస్తున్నారు. అటు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోనూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. శివలింగాపురంలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించిన 11 మెగా వాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం జైపూర్ మండల కేంద్రంలోని ఎస్​టీపీపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు.

వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ దృష్ట్యా బొగ్గు ఉత్పత్తి పెంచాలి : సింగరేణి రివ్యూలో భట్టి

Last Updated : Aug 31, 2024, 8:47 AM IST

ABOUT THE AUTHOR

...view details