Israel Lebanon Ceasefire Deal : ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కొనసాగుతోన్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెజ్‌బొల్లాతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సీజ్ఫైర్ గురించిన కీలక అంశాలపై సంప్రదింపులు జరుగుతున్నాయని, అవన్నీ పరిష్కారమయ్యేంత వరకు తుది ఒప్పందం ఖరారు కానట్లుగానే పరిగణిస్తామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ విషయంపై మంగళవారం ఇజ్రాయెల్ కేబినెట్ మీటింగ్ జరగనుంది.
3500 మంది మృతి!
ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హెజ్‌బొల్లాల మధ్య గతేడాది నుంచి పరస్పర దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ దాడుల వల్ల లెబనాన్‌లో 3500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 900 మంది వరకు మహిళలు, చిన్నారులే ఉన్నట్లు లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ యుద్ధం కారణంగా 10 లక్షలకుపైగా సాధారణ పౌరులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిపోయారని పేర్కొంది.
మానవ హక్కులకు భంగం!
ఇటీవల లెబనాన్‌లో ఇజ్రాయెల్ చేసిన దాడిలో ముగ్గురు జర్నలిస్టులు చనిపోయారు. ఈ ఘటనపై ఓ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. అవి పౌరులను లక్ష్యంగా చేసుకొని చేసిన ఉద్దేశపూర్వక దాడులేనని పేర్కొంది. అది పూర్తిగా యుద్ధ నేరం కిందకు వస్తుందని స్పష్టం చేసింది. ఇలా పౌరులపై పదేపదే దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరాను నిలిపివేయాలని అగ్రరాజ్యం అమెరికాకు సూచించింది.