Best Furniture Ideas for Children Drawing : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా, పిల్లలను మంచి స్కూల్లో వేయాలనో కారణాలేమైనా తరచూ ఇల్లు మారే వారు చాలా మందే ఉంటారు. ఇదిలా ఉంటే అద్దె ఇళ్లల్లో ఉండే వారిలో కొందరు తమ పిల్లలు గోడపై గీసే బొమ్మలవల్ల తరచూ ఇల్లు ఖాళీ చేస్తున్నామంటూ వాపోతుంటారు. ఇక సొంతిల్లు ఉన్నవాళ్లైతే ఏటా గోడలను శుభ్రపరిచి మళ్లీ పెయింట్ వేయిస్తుంటామని చెబుతుంటారు. అయితే చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను ప్రోత్సహిస్తేనే కదా.. ఆ అభిరుచి పిల్లలకు ఫ్యూచర్లో ఎన్నో బెనిఫిట్స్ అందిస్తుంది. మీ చిన్నారుల చేసే పనుల వల్ల మీరు పైన చెప్పిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? అయితే, డోంట్‌వర్రీ.. బయట మార్కెట్లో లభిస్తున్న ఈ ఫర్నిచర్ వస్తువులు మీ ఇంట్లో ఉంటే చాలు ఇకపై అలాంటి ఇబ్బందులను ఎదుర్కొవాల్సిన పనిలేదు అంటున్నారు నిపుణులు. మరి, ఆ బుజ్జి ఫర్నిచర్ ఐటమ్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆర్ట్ ఫర్నిచర్ : ప్రస్తుతం మార్కెట్లో చిన్నారులు బొమ్మలు వేసుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాటుతో ఆర్ట్ ఫర్నిచర్ లభ్యమవుతోంది. కుర్చీలు జతగా, డెస్క్‌లతో నార్మల్‌గా కనిపించే ఈ టేబుల్‌కు వన్ సైడ్ పేపర్షీట్ రోల్ బిగించేలా రూపొందించారు. దానికి షీట్ రోల్ ఫిక్స్ చేసి టేబుల్‌పై సరిపోయినంతగా తీసి ఇస్తే చాలు. పిల్లలు బొమ్మలు వేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే, టేబుల్‌కు అటాచ్డ్‌గా పక్కన ఉన్న డెస్క్‌లలో.. రంగుల పెన్సిళ్లు, డ్రాయింగ్ పుస్తకాలు వంటివి సర్దేయొచ్చు.
బాక్సులాంటి డెస్క్ : ఇంట్లో తక్కువ ప్లేస్ ఉన్నా కూడా చిన్నారుల కోసం ఈ బాక్సులాంటి డెస్క్ ఫర్నిచర్‌ను ఈజీగా ఏర్పాటు చేయొచ్చు. గోడకు అటాచ్డ్‌గా ఉన్నవైపు చిన్న చిన్న డెస్క్‌లు ఉంటాయి. వీటిలో క్రేయాన్స్ వంటివి పెట్టుకోవచ్చు. దానికి ఉన్న డోర్‌ను తెరిస్తే అది టేబుల్‌గా మారుతుంది. దీనికి డ్రాయింగ్ షీట్ రోల్ ఏర్పాటు చేసుకునే సౌకర్యం ఉంటుంది. టేబుల్ ఎదురుగా చిన్న స్టూల్ లేదా కుర్చీ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకు బొమ్మలేయాలనిపించినప్పుడు రోల్ నుంచి షీట్ తీసిస్తే సరిపోతుంది. ఆపై బాక్సును క్లోజ్ చేయొచ్చు. తిరిగి అవసరమైనప్పుడు దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు.
స్టాండు ఫర్నిచర్ : ఇది రెండు వైపు బోర్డులా ఉండి మధ్యలో డ్రాయింగ్ షీట్ రోలర్‌తో చెక్క పలకగా అనిపిస్తుంది. కావాల్సినప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే స్టాండులా తయారవుతుంది. మధ్యలో ఉన్న గ్యాప్‌లో అలమర ఉంటుంది. దానిలో కలర్స్ ఉంచుకోవచ్చు. దీన్ని రూమ్‌లోనే కాదు, గార్డెన్‌లోకీ తీసుకెళ్లొచ్చు. ప్రకృతిని ఆస్వాదిస్తూ కూడా పిల్లలు దీనిపై డ్రాయింగ్స్ వేసుకోవచ్చు.
గోడపై షీటు : గది గోడకు అటాచ్డ్‌గా రోలర్, దానికి కిందగా ఒక పొడవైన క్లిప్పు వస్తుంది. అవసరమైనప్పుడు షీట్ తీసుకుని చివర్లను క్లిప్పులో బిగించాలి. చిన్నారులు కింద కూర్చుని బొమ్మలు గీసుకోవచ్చు. కొందరు చిన్నారులకు ఎన్ని రకాల ఏర్పాట్లున్నా గోడపైనే వేయాలనే ఆలోచన వస్తుంటుంది. అలాంటివారికి ఈ వాల్ ఆర్ట్ షీటు ఫర్నిచర్ గోడపై వేసే ఫీలింగ్‌ని ఇస్తుందంటున్నారు నిపుణులు. ఈ బుజ్జి ఆర్ట్ ఫర్నిచర్స్ భలే ఉన్నాయి కదూ. మరి, ఇంకెందుకు ఆలస్యం ఇంట్లో మీ పిల్లలకూ ఏర్పాటు చేసేయండి!
ఇవీ చదవండి :
పిల్లల ముందు అలాంటి పనులు చేస్తున్నారా? - వాళ్లు అన్నీ గమనిస్తున్నారు జాగ్రత్త!
అలర్ట్ : పిల్లలకు ఈ రకాల బొమ్మలు కొనిస్తున్నారా? - అయితే వారు డేంజర్ జోన్లో ఉన్నట్టే!