Minister uttam on Sitarama project Launch : సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం స్వాతంత్ర దినోత్సవం రోజు జరగనుంది. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రెండో పంప్ హౌస్‌ను సీఎం ప్రారంభం చేస్తారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులు, ఇంజినీర్లతో మంత్రి హైదరాబాద్ జలసౌధలో సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీలు అనిల్ కుమార్, నాగేందర్ రావు, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.
సీతారామ ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్‌లో వెట్ రన్, రెండో పంప్ హౌస్‌లో డ్రైరన్ ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో రెండో పంప్ హౌస్ వద్ద పంపులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. 15వ తేదీన హైదరాబాద్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం సీఎం హెలికాప్టర్లో బయల్దేరి ఖమ్మం జిల్లా వైరా వెళ్తారు. ప్రాజెక్టును ప్రారంభించి, అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని మంత్రి ఉత్తమ్ చెప్పారు. సీఎం కార్యక్రమ పర్యవేక్షణ కోసం నోడల్ అధికారిని నియమించనున్నట్లు తెలిపారు.