Minister Uttam Kumar on Green Energy : రాష్ట్రంలోని వ్యవసాయం, పరిశ్రమలు, గృహాలు తదితర అన్ని రంగాలకి 24 గంటల విద్యుత్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఓ హోటల్లో నిర్వహించిన క్లీన్ ఎనర్జీ వర్క్ షాపులో మంత్రి ఉత్తమ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
బొగ్గుతో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో కాలుష్యం ఎక్కువగా వెలువడుతుందని ఈ సమావేశంలో వక్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందుకే బొగ్గుతో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను క్రమంగా తగ్గిస్తూ దాని స్థానంలో సౌర, గాలి, హైడ్రో పవర్ ఉత్పత్తి చేసేందుకు మొగ్గు చూపాలని నిపుణులు సలహాలు ఇచ్చారన్నారు. అందుకు తగ్గట్లే క్రమంగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని నిపుణుల సూచనలు ఎప్పటికప్పుడు తీసుకుంటామని చెప్పారు.
తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్లీన్ ఎనర్జీ వైపు ప్రయాణించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘటించారు. చెరువులు, కుంటలు వంటి వాటిని కూడా సంరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
"క్లీన్ ఎనర్జీ వర్క్ షాపును ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము. బొగ్గు ఆధారిత విద్యుత్ వినియోగం పర్యావరణానికి ఎలాంటి విఘాతం కలిగిస్తుందో తెలుసుకోవడానికి ఈ వర్క్ షాపు ముఖ్య ఉద్దేశం. బొగ్గు నుంచి సోలార్, సౌర, గాలి, హైడ్రో పవర్ ఉత్పత్తి వైపు గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లేందుకు ఈ సమావేశం ప్రధానాంశం. తప్పనిసరిగా రాష్ట్రప్రభుత్వం తరఫు నుంచి గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లేందుకు ప్రయత్నాలు చేస్తాం. పర్యావరణాన్ని కాపాడడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది." - ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి