Minister Tummala On Loan Waiver : తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే ఉద్దేశంతోనే రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి తుమ్మల మండిపడ్డారు. రుణమాఫీకి సంబంధించి 3.5 లక్షల కుటుంబాల నిర్ధరణ జరిగిందన్న ఆయన, మరో 4 లక్షల కుటుంబాల నిర్ధరణ జరగాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ రుణమాఫీ చేశామని తెలిపారు.
మూడు విడతల్లో రూ.18 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లుగా వివరించారు. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. రుణమాఫీపై బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలను తుమ్మల తిప్పికొట్టారు. రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వానికి సహకరించకపోగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
Tummala Fires On BJP :బీజేపీ నేతలు లేని సమస్యలను ఉన్నట్లు భ్రమిస్తున్నారని తుమ్మల దుయ్యబట్టారు. నిద్రలో వచ్చే కలలు ఊహించుకుని ప్రజలు, రైతులకు చెప్పి ఆందోళనకు గురిచేయాలన్న బీజేపీ ప్రయత్నం విఫలమైందని ఆక్షేపించారు. కేంద్రంలో బీజేపీ సర్కారు విధానాలు నిరసిస్తూ రైతులు రాజధాని దిల్లీ చుట్టుప్రక్కల రోడ్డు ఎక్కితే పట్టించుకోలేదని విమర్శించారు. నల్ల చట్టాలు రద్దు చేయాలని వర్షంలో తడుస్తూ ఎండలో ఎండుతూ అన్నదాతలు ఆందోళన చేసినా బీజేపీ కనికరం చూపలేదని దుయ్యబట్టారు. చివరకు సుప్రీంకోర్టు తాఖీదులతో కేంద్రం వెనక్కి తగ్గిందని తెలిపారు. ఆ తర్వాత కనీసం బాధిత రైతులను పరామర్శించలేదని మండిపడ్డారు.
"రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన మా ప్రభుత్వం ఆపనిలోనే ఉంది. ఇప్పటి వరకు 22 లక్షల ఖాతాల్లో నగదు జమచేశాము. 18 వేల కోట్లు నగదు జమ చేశాము. బీజేపీ వారు తప్పుడు స్థలంలో ధర్నా మొదలుపెట్టారు. మీ రాజకీయ స్వలాభం కోసం రైతులను పావులుగా వాడుకోవద్దని ఆ పార్టీవారికి(బీజేపీ) విజ్ఞప్తి చేస్తున్నాను. కొద్ది రోజుల్లోనే రేషన్ కార్డు లేనటువంటి రుణమాఫీకి అర్హులైన రైతుల ఖాతాల వివరాలు కూడా మాకు అందుతాయి. వారికి కూడా రుణమాఫీ చేస్తాము"- తుమ్మల నాగేశ్వర రావు, మంత్రి