Minister Sridhar Babu Slams On BRS Over Musi Protest :మూసీ నది ప్రక్షాళనపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను మంత్రి శ్రీధర్‌బాబు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మూసీ ప్రక్షాళన తాము చేసిన ఆలోచన కాదని, గత ప్రభుత్వమే రూపకల్పన చేసి ప్రణాళిక రూపొందించిందని వివరించారు. మూసీ నది ప్రక్షాళనపై అప్పటి మంత్రి కేటీఆర్ ఎన్నో సమావేశాలు నిర్వహించారన్నారు. అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాలని 2021లో కేటీఆర్ ఆదేశించారన్నారు. మూసీ నిర్వాసితులకు రెండుపడక గదుల ఇళ్లల్లోకి తరలించాలని కేటీఆర్ చెప్పారని గుర్తు చేశారు.
"గతంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ అనేక మీటింగ్‌లు నిర్వహించి మూసీ రివర్ బెడ్‌కు సంబంధించిన రెండు వైపులా 110 కి.మీ. రోడ్డు నిర్మాణం, బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ కానీ ఇలా అన్నింటినీ కూడా నిర్దారించి, వీటిపై ఉన్న నిర్మాణాలన్నింటినీ కూల్చేయాలని చెప్పారు. జీవో నంబర్ 07 తీసుకొచ్చి, 2016లో రివర్ బెడ్ బౌండరీకి సంబంధించి 50 మీటర్లను బఫర్ జోన్‌గా నిర్దారించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ జీవో తీసుకురావటం జరిగింది. మేము జీవోను ఏమి మార్పులు చేయలేదు. ఆరోజు వాళ్లు ఆలోచన చేస్తే మంచి కార్యక్రమం, ఇవాళ మేము కార్యచరణ చేస్తే మాత్రం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు."-శ్రీధర్ బాబు, ఐటీ మంత్రి
మీరు చేస్తే మంచి, మేము చేస్తే మాత్రం తప్పా : మూసీకి ఇరువైపులా 50 మీటర్లను బఫర్‌జోన్‌గా గుర్తించాలని జీవో జారీ చేసిందని, మూసీలో 8,480 అక్రమ కట్టడాలు ఉన్నాయని గత ప్రభుత్వమే లెక్క తేల్చిందన్నారు. మూసీ నదికి హద్దుల గుర్తింపుపై సర్వే కూడా పూర్తి చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాగితాల వరకే మూసీ ప్రక్షాళనను పరిమితం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంటే మాత్రం రాద్దాంతం చేస్తోందని విమర్శించారు.