Minister Sridhar Babu On Musi River Front: మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ నేతల విమర్శలను మంత్రి శ్రీధర్ బాబు తిప్పికొట్టారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు కొందరు అవకాశవాదులు తీవ్రంగా శ్రమిస్తున్నారని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్న శ్రీధర్ బాబు, ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. హైడ్రా, మూసీ ప్రక్షాళనపై ప్రతి జిల్లాలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రజలకు ఎలాంటి సందేహాలు వచ్చినా హెల్ప్ డెస్క్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చన్నారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలి: మూసీ ప్రక్షాళన కోసం మూసీ రివర్ ఫ్రంట్‌ను ఏర్పాటుచేసుకొని ముందుకు వెళ్తున్నామని శ్రీధర్ బాబు అన్నారు. సీఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయా కూల్చివేతలపై స్పందించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే చెరువులు, మూసీ ఆక్రమణలను తొలగిస్తున్నామని తెలిపారు. తెలిసో, తెలియకనో కొందరు మూసీలో ఇళ్లు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారని పేదలను నిలబెట్టాలన్నదే తమ ఉద్దేశ్యమని పడగొట్టాలని కాదని అన్నారు.
మూసీ నిర్వాసితులకు భరోసా : మూసీ రివర్ బెడ్లో ఉన్న అక్రమ నిర్మాణాలను మాత్రమే తొలగిస్తున్నారని అన్నారు. మూసీ నిర్వాసితులకు పూర్తి భరోసా ఇస్తున్నామని వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. నిర్వాసితులందరికి న్యాయం చేస్తామని వారందరిని కాపాడే బాధ్యత తమదేనన్నారు. హైదరాబాద్‌కు గోదావరి జలాలను తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని గోదావరి నీటిని మూసీ నదిలో ప్రవహింపజేస్తామన్నారు.