Minister Sridhar Babu On CLP Meet :సీఎల్పీ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సన్మానించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పార్టీ ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలనేది మాట్లాడుకున్నామని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో శాసనసభాపక్ష(సీఎల్పీ) సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు.
మా ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదు : కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతికహక్కు బీఆర్ఎస్‌కు లేదని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అరికెపూడి గాంధీ నియోజకవర్గంలో సీఎం సమావేశం జరగ్గా ఆయన మర్యాదపూర్వకంగా సీఎంను కలిసేందుకు వచ్చారని స్పష్టం చేశారు. సిద్దిపేటలో సీఎం సమావేశం జరిగితే హరీశ్‌రావు కలవలేదా అని ప్రశ్నించారు. సీఎల్పీ సమావేశంలో అరికెపూడి గాంధీ ఉండటం మీరు చూశారా అని శ్రీధర్ బాబు మీడియాను ప్రశ్నించారు.
"సీఎల్పీ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను సన్మానించాము. కొత్త పీసీసీ లీడర్ ఎంపిక తర్వాత సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి వారిని సన్మానించడం ఆనవాయితీ. పార్టీ ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలి అనేది మాట్లాడుకున్నాము. చాలా మంది సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. భవిష్యత్ కార్యచరణపై చర్చించాము. ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ చాలా మంచి సూచనలు చేశారు. మా ప్రభుత్వం మీద బీఆర్ఎస్‌కు మాట్లాడే అర్హత లేదు. అరికపూడి గాంధీ సీఎల్పీ సమావేశంలో పాల్గొన్నాడని మీకు తెలుసా?"-శ్రీధర్ బాబు, మంత్రి