తెలంగాణ

telangana

ETV Bharat / state

గాలి మాట‌లు చెప్పడం మానుకోవాలి - కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సీతక్క - MINISTER SEETHAKKA FIRES ON KTR - MINISTER SEETHAKKA FIRES ON KTR

Minister Seethakka Fires On KTR : అధికారంలో ఉన్నప్పుడు మ‌హిళల భ‌ద్రత‌ను గాలికొదిలేసి, ఇప్పుడు గాలి మాట‌లు చెప్పడం మానుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క హిత‌వు ప‌లికారు. బీఆర్ఎస్ హ‌యంలో మ‌హిళా భ‌ద్రత అంత ల‌క్షణంగా ఉంటే, మ‌హిళ‌ల‌పై ల‌క్షన్నర‌కు పైగా నేరాలెందుకు జ‌రిగాయ‌ని మంత్రి సూటిగా ప్రశ్నించారు.

Seethakka Slams KTR On Women Safety
Minister Seethakka Fires On KTR (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 19, 2024, 10:08 PM IST

Seethakka Slams KTR On Women Safety : రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు జ‌రుగుతుంటే తాను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న కేటీఆర్ వ్యాఖ్యల‌పై, మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. రాఖీ పండుగ రోజు కూడా మహిళా మంత్రిని, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ను నిందించడం కేటీఆర్‌కే చెల్లిందని ఆమె విమర్శించారు. పండుగ పూట రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారన్న సీత‌క్క, మహిళా భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంద‌ని స్పష్టం చేశారు.

అజ్ఞానానికి అద్దం పడుతోంది : రాష్ట్రంలో నేరాలకు కారణమవుతోన్న డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల క‌ట్టడి కోసం తాము చేప‌డుతున్న చ‌ర్యలు కేటీఆర్‌కు క‌నిపించ‌డం లేదా? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన 8 నెలల తర్వాత మహిళలపై అఘాయిత్యాలు గుర్తుకు రావాలని కేటీఆర్ చెప్పడం ఆయన అజ్ఞానానికి అద్దం పడుతోందని మంత్రి ఎద్దేవా చేశారు. మహిళలపై ఎక్కడ ఏ అఘాయిత్యం జరిగినా, ప్రభుత్వం స‌త్వర‌మే వాయు వేగంతో స్పందించిందని, గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేశామని తెలిపారు.

ఆమెను అడిగి తెలుసుకో : లైంగిక దాడుల కేసుల్లో ఇప్పటికే 24 మంది దోషులకు శిక్షలు పడేలా చేశామ‌ని మంత్రి సీతక్క పేర్కొన్నారు. దోషుల‌కు 20 ఏళ్ల నుంచి యావజ్జీవ కారగార శిక్షలు ప‌డేలా వ్యవ‌హ‌రించామ‌ని ఆమె తెలిపారు. బాధితులకు భరోసా కల్పించేందుకు మహిళా పోలీస్ సిబ్బందితో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని ఆమె ప్రశ్నించారు. మహిళా భద్రతకు కాంగ్రెస్ ఏం చేసిందో, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ప‌ని చేసిన సబితా ఇంద్రారెడ్డిని కేటీఆర్ అడిగి తెలుసుకోవాల‌ని సూచించారు.

వరంగల్‌లో అమ్మాయిలపై యాసిడ్ దాడి జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగిందో అంద‌రికీ తెలుసున‌ని, అప్పట్లో "దటీజ్ వైఎస్సార్‌" అని అంతా అభినందించిన‌ట్లు సీతక్క గుర్తు చేశారు. చ‌రిత్రలో మొట్టమొద‌టి సారిగా ఒకేసారి 138 మంది మహిళా ఎస్ఐలు, 2400 మంది మహిళా పోలీస్ కానిస్టేబుళ్లను రిక్రూట్ చేసి శిక్షణ ఇస్తున్నామ‌న్నారు. ఆస్తులు, అంతస్థులతో నిమిత్తం లేకుండా ఇప్పటికైనా మహిళలను గౌరవించడం కేటీఆర్ నేర్చుకోవాలని మంత్రి సీత‌క్క హితవు పలికారు.

అసలేం జరిగిందంటే : రాష్ట్రంలో శాంతిభద్రతలు బీఆర్ఎస్ హయాంలో ఎలా ఉన్నాయో? ఇపుడు ఎలా ఉన్నాయో? అందరికీ తెలుసని, కావాలంటే ఓ కమిషన్ వేసి విచారణ చేసుకోవచ్చని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎనిమిది నెలల తర్వాత అయినా మంత్రి సీతక్కకు మహిళలపై అఘాయిత్యాలు గుర్తుకురావడం మంచిదని, ఈ ప్రభుత్వం తీరు దున్నపోతు మీద వాన పడ్డట్లుగా ఉందని ఆయన విమర్శించారు. మహిళలపై జరిగిన వివిధ ఘటనల్లో తమ పార్టీ నాయకులు వెళ్లే వరకు పట్టించుకున్న పాపాన పోలేదని, రాష్ట్రానికి హోంమంత్రి కూడా దిక్కులేరని కేటీఆర్ దుయ్యబట్టారు.

తాను పొరపాటున నోరుజారి ఒక మాట అంటే క్షమాపణ చెప్పానని, ఆ తర్వాత కూడా ప్రపంచంలో ఇంతకంటే పెద్ద సమస్య లేనట్లు రాజకీయ రంగు పులుముతున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. షీటీమ్స్, భరోసా కేంద్రాలు, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ తదితరాలను ఎవరి హయాంలో ప్రారంభించారని ఆయన ప్రశ్నించారు. కోల్​కతాలో మహిళపై ఆఘాయిత్యం జరిగితే తెలంగాణలో చేసిన న్యాయం చేయాలని అంటున్నారని, "దటీజ్ కేసీఆర్" అని కేటీఆర్ పేర్కొన్నారు.

మహిళల భద్రత కోసం గ్రామస్థాయిలో సోషల్ యాక్షన్ కమిటీలు : సీతక్క - Seethakka Review On Women Safety

'అంగన్వాడీలకు నాణ్యమైన సరకులు సరఫరా చేయండి - లేదంటే తప్పుకోండి'

ABOUT THE AUTHOR

...view details