Minister Ramprasad Fires on YSRCP : ఆర్టీసీ కార్మికులు, ప్రయాణికులు రెండు కళ్ల లాంటి వారని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. జగన్ సంక్షేమం పేరు చెప్పి అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. గత ఐదేళ్లలో ఒక్క బస్సు కూడా కొనలేదన్నారు. ఏలూరు డిపోలో ఏర్పాటు చేసిన నూతన బస్సులను ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Ramprasad Opening New Buses in Eluru : ఈ సందర్భంగా రాంప్రసాద్‌రెడ్డి డిపోలో దూర ప్రాంతాలకు వెళ్లే 30 సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్ స్లీపర్ బస్సు సర్వీసులను ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ డిపో ఆవరణలో మొక్క నాటారు. అంతకు ముందు ఆయన దుగ్గిరాలలోని నివాసంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కలిశారు. కొత్త ప్రభుత్వంలో ఇప్పటివరకు 1400ల కొత్త బస్సులు కొన్నామని రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. తమ సర్కార్ ఏర్పాటయ్యక ఇప్పటికే రెండుసార్లు పింఛన్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఈనెల 15న అన్న క్యాంటీన్లు ప్రారంభించబోతున్నామని రాంప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
"కొత్త ప్రభుత్వంలో ఇప్పటివరకు 1400ల కొత్త బస్సులు కొన్నాం. ఆర్టీసీ సంస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఆర్టీసీకి కార్మికులు, ప్రయాణికులు రెండు కళ్ల లాంటి వారు. కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ప్రభుత్వం ఏర్పాటయ్యక ఇప్పటికే రెండుసార్లు పింఛన్లు ఇచ్చాం. ఈనెల 15న అన్న క్యాంటీన్లు ప్రారంభించబోతున్నాం." - మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి