CM Chandrababu Press Meet With AI Technology: అత్యాధునిక టెక్నాలజీ వినియోగంలో చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఉంటారు. మోడర్న్ టెక్నాలజీని వినియోగించడంలో ముందుండే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో వినూత్నం ప్రయోగం చేశారు.
దావోస్ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అయితే మామూలుగా ప్రెస్‌మీట్ అంటే విలేకరులు, కెమెరామెన్లతో గందరగోళంగా ఉంటుంది. అందుకే సీఎం చంద్రబాబు వినూత్న ఆలోచనకు తెరతీశారు. వినూత్నంగా కేవలం విలేకరులతో మాత్రమే ప్రెస్‌మీట్ నిర్వహించారు. మరి కెమెరామెన్లు ఎక్కడ అనేదేగా మీ ప్రశ్న. అయితే అవేం అవసరం లేకుండా ఏఐతోనే ఈ సమావేశం పూర్తి చేశారు.
ఏఐతో పనిచేసే సిస్టమ్: వీడియోగ్రాఫర్లు, కెమెరామెన్లు లేకుండా పూర్తిగా ఏఐతో పనిచేసే సిస్టమ్‌ను వినియోగించారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో 4 కెమెరాలతో మల్టీవీడియో కెమెరా సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీనిద్వారానే అక్కడ నుంచి లైవ్ కవరేజీ అందించారు. సమావేశం జరిగే హాల్లోకి చంద్రబాబు వచ్చిన సమయంలో ఒక కెమెరాకు సూచనలు ఇవ్వడం ద్వారా ఆయన్ను సెంటర్‌గా చేసుకుంటూ అదే వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసింది.
చంద్రబాబు నాయుడు సెంటర్ ఫ్రేమ్‌లో ఉండేలా చూసుకుంటూ అవసరమైన సర్దుబాట్లు చేసుకొని వీడియో ఔట్‌పుట్ ఎంతో క్లారిటీగా వచ్చింది. 8 మందితో చేసే పనిని ఈ ఏఐ కెమెరా వ్యవస్థ ద్వారా కేవలం ఒక్కరితోనే చేసేయొచ్చు. ఫలితంగా మీటింగ్ హాల్లో గజిబిజిగా ఎక్కువమంది అటూ, ఇటూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఎటువంటి గందరగోళానికి అవకాశం ఉండదు. నో మ్యాన్ విధానంలో ఆటోమేటిక్‌గా వీడియో రికార్డింగ్ పని జరుగుతుంది.
సొంత నిధులతోనే: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2025కి దావోస్‌కి వెళ్లిన వచ్చిన అనంతరం పర్యటన విశేషాలను చెప్పేందుకు చంద్రబాబు శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ ఏఐ సాంకేతికతను వినియోగించారు. మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ ఏఐ సాంకేతిక కెమెరా సిస్టంను ఏర్పాటు చేయించారు. సీఎం క్యాంపు కార్యాలయమైన ఉండవల్లి నివాసంలో ప్రభుత్వ నిధులతో ఈ సిస్టంను ఏర్పాటు చేసే అవకాశమున్నా, మంత్రి లోకేశ్ మాత్రం అందుకు అంగీకరించలేదు. తన సొంత నిధులతోనే ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు.
దావోస్ ఒప్పందాలపై దుష్ప్రచారం - ఏపీని మళ్లీ ప్రపంచపటంలో పెట్టడమే లక్ష్యం: చంద్రబాబు
'హైదరాబాద్ తెలుగు ప్రజలది - గోదావరి నీళ్లు బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు నష్టం లేదు'