Padma Shri was Awarded to Miriyala Apparao : 'వినరా భారత వీరకుమారా విజయం మనదేరా!' అంటూ సాగేదే బుర్రకథ. ఇదొక జానపద కళారూపం. బుర్రకథ పల్లెపదాలు, హాస్యాలు, బిగువైన కథనాలు, పద్యాలు, పాటలు అన్నింటినీ కలుపుకొంటూ సరదాగా సాగిపోయే ఓ అద్భుతమైన కళారూపం. పరిమితమైన ఆహార్యంతో, ఆడుతూ పాడుతూ హాస్యోక్తులు పలుకుతూ జనాలకు చేరువగా వెళ్లే కళారూపాలలో హరికథ మొదటిది అయితే బుర్రకథ రెండవ స్థానంలో ఉంటుంది. ఇంతటి అద్భుతమైన కళారూపాన్ని తెలుగు నేలపై ఐదు దశాబ్దాలు ప్రదర్శించిన ఘనత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలేనికి చెందిన కళాకారుడు మిరియాల అప్పారావు(76) సొంతం. ఐదు వేలకు పైగా ప్రదర్శనలిచ్చి తెలుగు జానపద కళకు ఊపిరులూదిన ఆయనకు కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న అప్పారావు ఇటీవల కన్నుమూశారు. ఆయన పెద్దకార్యం శనివారం కోనసీమ జిల్లా రావులపాలెంలో నిర్వహించారు. ఆ రోజునే పద్మశ్రీ పురస్కార ప్రకటన వెలువడింది.
మిరియాల అప్పారావుకు తాడేపల్లిగూడెంతో అనుబంధం ఉంది. దీంతో స్థానికులు ఆయనతో అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అప్పట్లోనే అక్షరాస్యత, బాల్య వివాహాలపై బుర్రకథల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపేవారని గుర్తు చేసుకుంటున్నారు. స్వస్థలం రావులపాలెం అయినప్పటికీ భార్య చనిపోయిన తర్వాత తాడేపల్లిగూడెం పట్టణంలోని చిన్న కుమార్తె శ్రీదేవి వద్ద నాలుగేళ్ల పాటు ఉన్నారు. వయసు రీత్యా అనారోగ్యంగా ఉండటంతో కొన్ని రోజుల కిందట స్వస్థలం రావులపాలెం తీసుకెళ్లారు. అక్కడే ఆయన తుది శ్వాస విడిచారు.
మిరియాల అప్పారావుకు చిన్ననాటి నుంచి కళలంటే ఎంతో ఇష్టం. ఆ నాటి నుంచి నాటక, బుర్రకథ ప్రక్రియలవైపు ఆకర్షితులయ్యారు. తన గాత్రం ఆకట్టుకోవడంతో బుర్రకథ ప్రదర్శనల్లోకి వచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు సింగపూర్, కువైట్ వంటి దేశాలలోనూ ప్రదర్శనలు ఇచ్చారు. అప్పారావు 365 రోజుల్లో 300 రోజులు బుర్రకథ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. బుర్రకథ టైగర్, గానకోకిల, వైఎస్‌ఆర్ ఎచీవ్‌మెంట్ వంటి బిరుదులు, పురస్కారాలతోపాటు ఎన్నో సత్కారాలు ఆయన అందుకున్నారు. అస్వస్థతకు గురై ఈ నెల 15న తుదిశ్వాస విడిచారు. అప్పారావు భార్య నాగమణి కూడా బుర్రకథలు ప్రదర్శిస్తారు. ఆమె 2018లో మరణించారు. ఈ దంపతులకు 3 కుమారులు సుబ్బరాజు, బ్రహ్మాజీ, బాబా, ఇద్దరు కుమార్తెలు లలిత, శ్రీదేవి. ప్రస్తుతం వీరంతా బుర్రకథ కళాకారులే. నేడు ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తున్న 70 శాతం మంది అప్పారావు శిష్యులే కావడం విశేషం. కళారంగానికి చేసిన సేవలకుగాను అప్పారావుకు మరణానంతరం గుర్తింపు లభించిందంటూ స్నేహితులు, బంధువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
అసామాన్య కృషికి సత్కారం - ఏపీ నుంచి నలుగురికి 'పద్మ' పురస్కారం
'పద్మ' అవార్డు గ్రహీతలకు ఎలాంటి ప్రయోజనాలు? - ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందా?