Minister Ponguleti Srinivas Reddy on Dharani Portal :గత బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లోపభూయిష్టంగా ఉందని ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూసంస్కరణల్లో విప్లవాత్మక మార్పులు తెస్తామని చెప్పి తీసుకొచ్చిన ఈ పోర్టల్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధరణి తెచ్చిన సమస్యలకు పేదరైతులు చెప్పలరిగేలా అధికారుల చుట్టూ తిరిగాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ పోర్టల్ పేరుతో అప్పటి పెద్దాయన ప్రజలను దగా చేశారని ఆరోపించారు. ధరణి పేరుతో కొందరికి భూములు కట్టబెట్టేందుకు కుట్రలు చేశారని మండిపడ్డారు. సాదాబైనామాల పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారన్న ఆయన ఇప్పటివరకు 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.
అందుకే ప్రజలు మాకు అధికారం ఇచ్చారు :ధరణి పోర్టల్ నిర్వహణను డీఫాల్డ్ అయిన సింగపూర్ కంపెనీకి అప్పగించారన్న పొంగులేటి ధరణి చట్టం అనే భూతం రాష్ట్రమంతా విస్తరించిందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని ప్రజలకు చెప్పామని అందుకే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని తెలిపారు. భూసంస్కరణల డ్రాఫ్ట్ చట్టాన్ని మూడువారాల్లో వెబ్‌సైట్‌లో పెడతామని వెల్లడించారు. డ్రాఫ్ట్ చట్టంపై సూచనలు, సలహాలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు మంచిచేసే ప్రతి సూచననూ స్వీకరిస్తామని చెప్పారు.
ధరణి పేరుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. భూసమస్యలపై వచ్చిన అన్ని దరఖాస్తులనూ పరిశీలిస్తామని వెల్లడించారు. దరఖాస్తు తిరస్కరిస్తే కారణం రాయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. అంతా తమకే తెలుసు అనేలా తాము ప్రవర్తించమని స్పష్టం చేశారు. తమ లక్ష్యం ప్రజలు సులభతరంగా సేవలు పొందడమేనని చెప్పారు.