Minister Ponguleti Fires On BRS :అభివృద్ధి, సంక్షేమమే రెండు కళ్లుగా కాంగ్రెస్ సర్కార్ పని చేస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ధనిక రాష్ట్రం అని గత పాలకుల్లా గొప్పలు చెప్పడం కాకుండా, ప్రాధాన్యతాపరంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం ఉన్నా, ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు తెలిపారు.
రైతులను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారు :రుణమాఫీ ద్వారా రూ.19 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, వివిధ కారణాలతో ఆగిన మొత్తాన్ని త్వరలోనే జమ చేయనున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రుణమాఫీ అంశంలో బీఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లిచ్చామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పిందని, కానీ 50 శాతం కూడా నీళ్లివ్వలేదని సర్వే ద్వారా తేలిందని చెప్పారు. హనుమకొండ జిల్లా పరకాలలో పర్యటించిన మంత్రి, రూ.5 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులకు, రూ.11.75 కోట్లతో అమృత్ 2.0 మంచి నీటి సరఫరా పథకం పనులకు శంకుస్థాపన చేశారు.
" రైతుల ఖాతాల్లో రుణమాఫీ పథకం ద్వారా ఇప్పటికే సుమారు రూ.19 వేల కోట్లు జమచేశాం. మిగిలిన రూ.12 వేల కోట్లను జమ చేస్తాం. అన్నదాతలు సహనాన్ని కోల్పోవద్దు. ఇచ్చిన మాట నెరవేర్చేది ఇందిరమ్మ ప్రభుత్వం. ఏదైనా కారణాల వల్ల రైతులకు రుణమాఫీ అందకపోతే వారికి కూడా ఇస్తామని హామీ ఇస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశాం" - పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి