Minister Komatireddy met Sritej in KIMS :ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవన్న మంత్రి కోమటిరెడ్డి టికెట్ల రేటు పెంపుపై సమీక్షించి అనుమతినిస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అన్ని సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఉండదని వెల్లడించారు. సందేశాత్మక, దేశభక్తి చిత్రాలకే రేట్ల పెంపునకు అనుమతి ఉంటుందన్నారు. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి సంబంధిత చిత్రాలకే టికెట్ల రేట్లు పెంపునకు అనుమతి ఉంటుందన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాలుడు శ్రీతేజ్‌ను మంత్రి కోమటిరెడ్డి పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
"ఇకముందు తెలంగాణలో నో బెన్ఫిట్ షోస్. వాళ్లు ఎంత పెద్ద బడ్జెట్ సినిమాలు తీసినా కానీ టికెట్ రేట్లు పెంచే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాము. దేశ స్వాతంత్య్ర పోరాటానికి, తెలంగాణ ఉద్యమానికి సంబంధించినవి, యువతకు మంచి సందేశాన్నిచ్చే సినిమాలకు మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. అది కూడా నామినల్‌గా ఉంటుంది. బెనిఫిట్ షోలకు అసలే అనుమతి ఇచ్చేది లేదు. పుష్ప-2తోనే వాటికి స్టాప్. హిస్టరీ, దేవుళ్ల సినిమాలు, రాజులవి, తెలంగాణ సినిమాలు తప్ప మిగిలిన సినిమాలను నేను చూడదలుచుకోలేదు"-కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రి
హీరో అలా చేయడం సరికాదు :అనుమతి తిరస్కరించిన తర్వాత కూడా హీరో థియేటర్‌కు రావటం సరికాదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే రాజకీయ నేతలు కూడా సభలు రద్దు చేసుకుంటారని తెలిపారు. పిల్లల కోరిక మేరకు తండ్రి, కుటుంబంతో సహా సినిమాకు వెళ్లారన్నారు. వాళ్లు సినిమాకు వెళ్లినరోజే థియేటర్‌కు హీరో వచ్చారని తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండానే చిత్రబృందం హాల్ దగ్గరకు వచ్చిందని కోమటిరెడ్డి ఆరోపించారు. హీరో కాన్వాయ్, అనేక మంది బౌన్సర్లు థియేటర్‌కు వచ్చారని వివరించారు.