Minister Komatireddy On Allu Arjun :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీ నటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా తన ఇమేజ్ దెబ్బతీశారంటూ అర్జున్ మాట్లాడటం సరికాదన్నారు. నిన్న సాయంత్రం(శనివారం) జరిగిన ప్రెస్మీట్లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై కోమటి రెడ్డి స్పందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదనటం హాస్యాస్పదమన్నారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిన్నదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.
అల్లు అర్జున్ అన్నమాటలు వెనక్కి తీసుకోవాలి :మరోవైపు ఇదే అంశంపై పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా స్పందించారు. ప్రజా ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఎమ్మెల్సీ బలుమూరు వెంకట్ తెలిపారు. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సామాన్యులను కష్టపెడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని ప్రజలకు ధైర్యం, భరోసా కల్పించే ప్రయత్నం చేస్తే స్వాగితించాల్సింది పోయి, వెంటనే సీనీ నటుడు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని బలుమూరు వెంకట్ ప్రశ్నించారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై నటుడు అల్లు అర్జున్ ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుని అన్న మాటలు వెనక్కి తీసుకోవాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఎవరు తప్పు చేసినా ప్రజా ప్రభుత్వంలో న్యాయం, ధర్మం వైపు అండగా నిలవాల్సిన బాధ్యత సీఎంకు ఉంటుందని అదే విషయాన్ని రేవంత్ రెడ్డి స్పష్టమైన వైఖరిని అసెంబ్లీ సమావేశాల్లో తెలియజేస్తే ఆ వెంటనే అర్జున్ మీడియా సమావేశం పెట్టడం సరిగాదని వెంకట్ మండి పడ్డారు.