Minister Komati Reddy slams BRS : మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే, ఎందుకు ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. మూసీ అభివృద్ధిని అడ్డుకుంటే తాము ప్రత్యక్ష ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మూసీ వల్ల కలిగే ఇబ్బంది తెలిస్తే జర్నలిస్టులు కూడా సహించరన్న ఆయన, మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా అని సవాల్ విసిరారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లకు మానవత్వం లేదని విమర్శించారు. నల్గొండ జిల్లా గ్రౌండ్ వాటర్‌లో ఫ్లోరైడ్ ఎక్కువన్న ఆయన, మూసీలో పారేది విషపు నీళ్లని తెలిసి కూడా ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయని ఆరోపించారు.
మూసీని ప్యూరిఫైర్ రివర్‌గా : మూడు నాలుగు కోట్లు పెట్టి విల్లా కొనుకున్న వాళ్లు అయినా, గుడిసె వేసుకుని నివాసం ఉంటున్న వాళ్లయినా మూసీ పక్కన ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నారన్నారు. మూసీని ప్యూరిఫైర్ రివర్‌గా మార్చాలని ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేందుకు ముఖం చెల్లడం లేదని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చి మూసీ ప్రక్షాళనపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ తమ ఊరిలో బస చేయాలని, అక్కడ కనీసం టిఫిన్ కూడా చేయలేమని ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ డెవలప్మెంట్ బోర్డు అన్నారు కదా ఏమైందని ప్రశ్నించారు. మూసీ పరిస్థితి ఎలా ఉందో గత సీఎం కేసీఆర్ దగ్గర ఓఎస్డీగా పని చేసిన ప్రియాంక వర్గీస్‌ను అడిగితే తెలుస్తుందన్నారు.