Minister Raja Narasimha React on KTR Tweet Over MBBS Admissions :వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు విషయంలో ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీఓ 33పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎక్స్ వేదికగా స్పష్టత ఇచ్చారు. జీఓ 33తో స్థానిక విద్యార్థులు నష్టపోతారంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి స్పందించారు.
ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపునకు సంబంధి 2017 జులై 5న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 114 ని ప్రస్తావించిన మంత్రి రాజనర్సింహ, ఆ జీఓలోని 9 నుంచి 12 తరగతి వరకు చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణిస్తు చేసిన క్లాజ్‌ను జీఓ 33లో కొనసాగించామని పేర్కొన్నారు. అయితే అదే జీఓలోని 6 నుంచి 12 వరకు కనీసం 4 ఏళ్లు విద్యార్థులు చదివిన ప్రాంతానికి స్థానికతను వర్తింపజేయాలన్న నిబంధనను కొనసాగించలేమన్నారు.
జీఓ 114లోని ఈ నిబంధన ప్రకారం విద్యార్థి 4 ఏళ్లు తెలంగాణలో, మిగిలిన మూడు సంవత్సరాలు ఏపీలో చదివితే అతన్ని తెలంగాణ స్థానికుడిగా పరిగణించారని గుర్తు చేశారు. అయితే ఏపీ పునర్వ్యవస్థీకరణ యాక్ట్ ప్రకారం పదేళ్లు పూర్తైన నేపథ్యంలో నిబంధనను కొనసాగించలేమని పేర్కొన్నారు.
KTR Fires On Congress Govt About Medicine GO : అంతకముందు తెలంగాణ విద్యార్థులకు మెడిసిన్ సీట్ల అంశంపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వులపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ ఉత్తర్వులు అమలు చేస్తే, తెలంగాణ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.