తెలంగాణ

telangana

ETV Bharat / state

చిరు ధాన్యాలతో ఆరోగ్య సిరి - వరదాయినిగా మారిన మిల్లెట్స్​ - Millets Benefits in Daily Life - MILLETS BENEFITS IN DAILY LIFE

Millets Benefits in Daily Life : ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ మందిని కలవరపెడుతున్న అంశం జీవనశైలి జబ్బులు. ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటివి ఇప్పుడు, వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కువ మందిని భయపెడుతున్నాయి. కారణం పెరిగిన కాలుష్యం, మారిన జీవన శైలి. ముఖ్యంగా తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. జంక్‌, ప్రాసెస్‌డ్‌ ఆహారం అనేక రోగాలకు కారణం అవుతోంది. ఈ పరిస్థితుల్లో రోగాలను దరిచేరనీయని చిరుధాన్యాలు అమృతంలా మారాయి. ప్రపంచంలో అనేక మంది తమ ఆహారంలో వీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవి చేసే మేలును గుర్తించి 2023ను ఐరాస మిల్లెట్‌ సంవత్సరంగా గుర్తించగా, కేంద్ర ప్రభుత్వం శ్రీ అన్న పేరుతో విస్తృత ప్రచారం కల్పించింది. ఇక చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను వండి వారిస్తున్న హోటళ్ల సంఖ్య సైతం పెరుగుతోంది.

Health Benefits of Millets
Millets Benefits in Daily Life (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 18, 2024, 10:45 PM IST

చిరు ధాన్యాలతో ఆరోగ్య సిరి (ETV Bharat)

Health Benefits of Millets :ఆధునిక యుగం మనిషి జీవితంలో వేగాన్ని పెంచింది. గడియారంతో పోటీ పడుతూ తీవ్ర ఒత్తిడి మధ్య పని చేస్తే కానీ బతకలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మనిషి అనేక ముఖ్య విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ప్రధానంగా ఆరోగ్యాన్ని నిర్దేశించే తిండి, నిద్ర విషయంలో సమతౌల్యం లోపిస్తోంది. ఉద్యోగ, కుటుంబ ఒత్తిళ్ల మధ్య వంట చేసుకునే సమయం లేకపోవడం వల్ల ఆరోగ్యానికి చేటు చేసే జంక్‌ ఫుడ్‌, ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌ ఆశ్రయించాల్సి వస్తోంది.

ఫలితంగా శరీరంలో కొవ్వు పెరిగి చిన్న వయసులోనే బీపీ, షుగర్‌, గుండెజబ్బులు సహా ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తోంది. అయితే కొవిడ్‌కు ముందు వరకు ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నా ఆ తర్వాత మాత్రం పరిస్థితుల్లో మాత్రం క్రమంగా మార్పు రావడం ఆరంభమైంది. ప్రజల్లో ఆరోగ్య, పోషహాకార స్పృహ పెరిగింది. ఫలితమే విస్తృత పోషకాలు కల్గిన చిరుధాన్యాలకు ఆదరణ పెరగడం. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తూ ఉండడంతో ప్రస్తుతం అనేక మంది ప్రజలు చిరుధాన్యాలతో చేసిన ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు.

Best Food to Health & Cure Disease :మిల్లెట్స్‌ను చిరు ధాన్యాలు, తృణ ధాన్యాలు అని అంటారు. జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగెలు, రాగులు, అరికెలు, అండు కొర్రలు, సామలు, ఊద‌లు, ఉలవలు వంటి వాటిని మిల్లెట్స్‌గా పరిగణిస్తారు. ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే ఆహార పదార్థాలు కావడంతో వీటిని సిరి ధాన్యాలు అని కూడా అంటారు. వీటిలో ఎక్కువ భాగం మొదట పశువులకు మేతగా వాడేవారు. తర్వాత క్రమంగా మన ఆహారంలో భాగంగా మారాయి.

వీటిలో మాంసకృత్తులు, ఖనిజాలు, విటమిన్లు ఎక్కువ. గోధుమల కంటే 3 నుంచి 5 రెట్లు పోషకాలు కల్గి ఉంటాయి. B విటమిన్‌, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ కల్గి ఉండడంతో పాటు గ్లూటెన్ లేకుండా ఉంటాయి. వీటిలోని అధిక పోషకాల కారణంగానే చిరుధాన్యాలను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు.

కేంద్ర ప్రభుత్వం శ్రీ అన్న పేరుతో విస్తృత ప్రచారం : ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్​లో​ మిల్లెట్స్​ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 'శ్రీ అన్న' పేరుతో ప్రస్తావించారు. 'శ్రీ అన్న' అంటే అన్ని ఆహార ధాన్యాలలో అత్యుత్తమమైనది అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. శ్రీ అంటే స్థూలంగా దైవ కృప అని అర్థం. 'అన్న' అంటే ఆహార ధాన్యం, అంటే దైవానుగ్రహం కలిగిన ఆహార ధాన్యం అని అన్నారు.

చిరుధాన్యాలకు ప్రాచుర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు అంతర్జాతీయ ఫుడ్ ఫెస్టివల్​లలో వీటితో చేసిన ఆహార పదార్థాలను ప్రత్యేకంగా వడ్డించే ఏర్పాటు చేసింది. పార్లమెంట్‌లో ఎంపీల కోసం ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనంలోనూ చేర్చింది. దిల్లీలో ఇటీవల జరిగిన జీ-20 సమావేశంలో శ్రీ అన్న వంటకాలు విదేశీ అతిథులకు ప్రత్యేకంగా వడ్డించడం ద్వారా వాటికి ప్రాముఖ్యం కల్పించారు. పేరు ఏదైనా వీటికి ఇప్పుడు చాలా ప్రాచుర్యం వచ్చింది. ఐక్యరాజసమితి కూడా 2023ను మిల్లెట్ ఇయర్​గా ప్రకటించడంతో చాలా మందికి వీటి అవసరం తెలిసింది.

Importance of Millets in a Healthy Diet : చిరుధాన్యాల సాగు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. తక్కువ కాలంలో పండే పంటలు. మిగతా పంటలతో పోలిస్తే ఎరువులు, పురుగు మందుల వాడకమూ తక్కువే. ఇవి వర్షాధారితంగా ఎక్కువ పండుతాయి. రసాయనాలు లేకపోవడం, తక్కువ కొవ్వు, అధిక ఫైబర్ ఉండటంతో మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గాలనుకునే వారికి చిరుధాన్యాలు వరదాయినిగా మారాయి.

సకల పోషకాలు కలిగిన పదార్థాలు కాబట్టి మిల్లెట్స్ కు అంత ప్రాధాన్యం ఉంది. మిల్లెట్స్ ను ప్రజలు ప్రధానంగా రొట్టెలు, దోశలు, సూప్‌లు, అన్నం లాగానే తయారు చేసుకుని తింటారు. వీటిని కడిగి నానబెట్టిన తర్వాతే తీసుకోవాలి. ఎందుకంటే ఇది సూక్ష్మ పోషకాల జీవలభ్యతను అందిస్తుంది. జీర్ణ సమస్యలు కూడా రావు. చిరు ధాన్యాలు చాలా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది.

చిరు ధాన్యాలు ఆరోగ్యానికి మేలు : ఇది చిన్నపిల్లల్లో ఎముకలను ధృడం చేయటంతోపాటు మలబద్ధకాన్ని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. కొర్రలు, సజ్జల్లో ఉండే ఫైబర్, జీర్ణసమస్యలను దరిచేరనీయదు. బియ్యం ఇతర ధాన్యాలతో పోలిస్తే వీటిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తక్కువ తిన్నా, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఉంటుంది. చిరుధాన్యాలలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతను నివారించి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.

పొద్దు పొద్దున్నే రాగులను బ్రేక్‌ఫాస్ట్‌లో తిన్నారంటే - మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి! - RAGI HEALTH BENEFITS

చిరు ధాన్యాలను క్రమం తప్పకుండా తీసుకుంటే ఇందులో ఉండే అమినో యాసిడ్ నేచురల్ యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. చిన్నపిల్లలకు ఈ ఆహారాన్ని అందించటం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని రకాలు పోషకాలు అందుతాయి. అంతేకాక వృద్ధులకు కావలసిన పోషకాలు కూడా అధికంగా ఉంటాయి.

కాల్షియం ఎక్కువగా ఉన్న మిల్లెట్స్ కండరాల పనితీరును మెరుగ్గా చేస్తుంది. ఇందులో ఫెరులిక్ యాసిడ్, కాటెచిన్స్ వంటి ఫైటోన్యూట్రియెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. గాయాలు తొందరగా నయమవుతాయి. చిరు ధాన్యాల్లో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ నాడీవ్యవస్థను, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తూ మనస్సును ప్రశాంతంగా ఉంచుంది.

Millets Food Store on Wheels : మిల్లెట్స్‌కు నగరాలు, పట్టణాల్లో కూడా ఆదరణ పెరుగుతోంది. వీటి నుంచి నచ్చిన ఆహారం తయారు చేసుకోవడం అందరికీ తెలియదు. అందుకే పట్టణాల్లో మిల్లెట్స్​తో చేసిన ఆహారం విక్రయించేందుకు ప్రత్యేకంగా రెస్టారెంట్​లు, హోటళ్లు ఏర్పడ్డాయి. ఇక్కడ అల్పాహారం, జావతో పాటు పలు పకాల ప్రత్యేక పదార్థాలు సిద్ధం చేసి విక్రయిస్తున్నారు. వీటికి గిరాకీ నానాటికీ పెరుగుతోంది.

పెద్ద పెద్ద మార్టుల్లో సైతం చిరు ధాన్యాలను ప్రత్యేకంగా ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. రకరకాల వంటలతో పాటు కుకీలను తయారు చేసి అందుబాటులో ఉంచుతున్నారు. చైనీస్ ఫుడ్ అయిన నూడిల్స్​ను కూడా మిల్లెట్స్​తో తయారు చేసి అమ్ముతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోయింది. ఫలితంగా వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. వేసవిలో అధిక ఎండలు, అకాల వర్షాలు, కాలం కాని కాలంలో వానలు, రుతుపవనాల రాకలో ఆలస్యం, అధిక చలి ఇలా పలు అసాధారణ వాతావరణ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

వీటి వల్ల కొత్త కొత్త రోగాలు పుట్టుకువస్తున్నాయి. దీనికి తోడు మారిన జీవన శైలి కూడా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ పరిస్థితుల్లో మెండుగా పోషక విలువలు కల్గిన మిల్లెట్స్‌ ఆరోగ్య ప్రదాయినిగా మారాయి. తిన్నవారికి ఆరోగ్యం, పండించిన వారికి లాభం చేకూరుస్తున్నాయి. మరి చిరుధాన్యాల ప్రాధాన్యతను గుర్తెరిగి వీటిని అంతా తమ ఆహారంలో భాగం చేసుకోవడమే తరువాయి.

భారత్​లో చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించిన ఐసీఏఆర్​, ఐఐఎంఆర్​

చిరుధాన్యాలు ఆరోగ్యానికి మేలు - మిల్లెట్స్‌తో రుచికరమైన భోజనం

ABOUT THE AUTHOR

...view details