Cyclone Alert for AP : ఏపీకి మరోసారి తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ మీదుగా ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర అండమాన్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు పంపింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా వెళ్లి మంగళవారానికి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ వాయుగుండం కాస్త ఈనెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఈ తుపాను ఈనెల 24 నాటికి ఒడిశా-బంగాల్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల 24,25 తేదీల్లో ఉత్తరాంధ్రలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈనెల23,24 తేదీల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈదురు గాలులు వీస్తాయంది. ఆ రోజుల్లో జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే సముద్రం నుంచి తిరిగి రావాలని సూచించింది.
నాలుగు రోజుల క్రితం రాయలసీమకు భారీ వర్షాలు : నాలుగు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలను అతలాకుతలం చేసింది. వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. తిరుమల భారీ వర్షాలకు తడిసి ముద్దైంది. తిరుమలలో భారీ వర్షం కురవడంతో ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో శ్రీవారి నడకమార్గంలో భక్తులను రాకుండా ఒకరోజు నిలిపివేశారు.