Mentally Disabled woman Gave Birth in AP :ఆమె ఏ ఇంటి ఆడబిడ్డో, ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. ఆమెకు సుమారు 35 ఏళ్ల వయసు ఉండగా, మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం గ్రామీణం శాటిలైట్ సిటీలో సుమారు రెండేళ్ల నుంచి ఓ ఆలయం వద్ద ఉంటూ యాచన చేసుకుంటుంది. అక్కడున్న స్థానికులు ఇచ్చే ఆహారాన్ని తింటూ జీవనం సాగిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ఆమె గర్భవతి అయ్యింది. తాను గర్భిణీని అన్న విషయం కూడా అర్థం చేసుకోలేని స్థితి ఆమెది. ఈ నెల 15 ఉదయం ఆమె ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
బిడ్డును పెంచుకోవడానికి పలువురు ఆసక్తి :బిడ్డతో ఆమె పరుగు పెడుతుంటేఅక్కడున్న స్థానికులు ఆమెను చూసి తొలుత ఎవరింటి శిశువునో తీసుకుని పారిపోతున్నట్లుగా భావించారు. అసలు విషయం తెలుసుకుని ఆమెపై జాలి పడ్డారు. అనంతరం ఆమె బిడ్డను చేరదీసి పాలు పట్టారు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన పలువురు ఆ బిడ్డను పెంచుకోవడానికి ఆసక్తి చూపించారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఎస్బీ కానిస్టేబుల్ రామయ్యకు ఈ విషయం తెలియడంతో ఆయన ఛైల్డ్ లైన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఏపీ సచివాలయం సిబ్బంది, పోలీసుల సహకారంతో తల్లీబిడ్డలిద్దరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరు ఆరోగ్యంగా ఉన్నారు.