Marriage Frauds in AP :పెండ్లి సంబంధం కుదుర్చుకోవాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలనేది ఒకప్పటి మాట. నేడు ఓ వైపు టెక్నాలజీ పుణ్యమా అని ఆన్లైన్లోనే సంబంధాలు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు మ్యారేజ్ బ్యూరోలు, మధ్యవర్తుల ద్వారా వివాహాలు కుదుర్చుకుంటున్నారు. మరి అసలు సమస్య ఇక్కడే ఎదురవుతోంది. తాజాగా ఓ ముఠా వయసు మీరిన వరులే లక్ష్యంగా గాలం వేస్తోంది. తమను సంప్రదించిన వారిని మాటల్లోకి దింపి వారి దగ్గర నుంచి అందినకాడికి దోచుకుంటోంది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
ఓ అక్క, ఓ బావ అన్న, వదిన ఆపై అత్తమామలు ఆడపడుచు ఈ ముఠాలోని పాత్రలు. వీరంతా తల్లిదండ్రులు చనిపోయిన ఆ పేద యువతికి ఓ మంచి సంబంధం చూసి వివాహం చేయాలని చూస్తారు. అవసరమైతే ఎదురు డబ్బు ఇచ్చే వ్యక్తికి ఇచ్చి పెండ్లి జరిపించాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదంతా నిజమనుకుని నమ్మినవారి నుంచి రూ.లక్షల్లో సొమ్ము గుంజి పరారవుతారు. తీరా చూస్తే వారంతా పెళ్లికాని ప్రసాదుల్ని లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.
Wedding Frauds in West Godavari Dist : ఇలాంటి ముఠాల వలలో చిక్కుకొని పశ్చిమగోదావరి జిల్లాలో పదుల సంఖ్యలో బాధితులు రూ.లక్షల్లో సొమ్ము పోగొట్టుకున్నారు. దీనిపై ఇటీవల ఫిర్యాదులు అందటంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని సామాజికవర్గాల్లో పెళ్లీడు ఆడపిల్లలు తక్కువగా ఉండటంతో అవివాహిత యువకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. పెళ్లి సంబంధాలు దొరక్క విసిగిపోయిన వీరు దూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో పేదింటి యువతులకు ఎదురుకట్నం ఇచ్చి మరీ వివాహం చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ పరిణామాన్ని సొమ్ము చేసుకునేందుకు నకిలీ పెళ్లి గ్యాంగ్‌లు పుట్టుకొచ్చాయి.
రాయలసీమలోని హిందూపురానికి చెందిన ఓ వ్యక్తికి 40 సంవత్సరాలు దాటాయి. ఆ ప్రాంతంలో వధువుల కోసం వెతికినా దొరకలేదు. భీమవరానికి చెందిన అగ్రవర్ణ పేదింటి యువతి ఉందని మధ్యవర్తులు ఆయనకు సమాచారం అందించారు. ఆ వ్యక్తి భీమవరం వచ్చి మధ్యవర్తులను కలవగా, అమ్మాయి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని పెళ్లి చేసుకుని తీసుకెళ్లవచ్చని చెప్పి రూ.4.5 లక్షలు లాగేశారు. వివాహం చేసుకొని ఆమెను సొంతూరికి తీసుకెళ్లాడు. రెండు రోజులకే అనారోగ్యమంటూ నాటకం మొదలుపెట్టింది. వారం తర్వాత మా వాళ్లను చూసొస్తానని పట్టుపట్టడంతో భర్త ఆమెను భీమవరం తీసుకొచ్చారు. టౌన్ రైల్వేస్టేషన్‌కు వచ్చాక మాయ మాటలు చెప్పి, కనిపించకుండా పోయింది. పెళ్లికొడుకు మధ్యవర్తులకు ఫోన్ చేసి ఆరా తీయగా నకిలీ పెళ్లి వలలో చిక్కుకున్నట్లు అర్థమైంది.