Medigadda Barrage Temporary Repairs 2024 :మేడిగడ్డ బ్యారేజీలో తాత్కాలిక మరమ్మతులు ప్రారంభమవ్వగా, మరిన్ని పనులు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దెబ్బతిన్న, కుంగిన ఏడో బ్లాక్‌లో మొత్తంగా 11 గేట్లు ఉండగా, ఇందులో ఎనిమిది గేట్లు మూసి ఉన్నాయి. ఆనకట్ట పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ఆ బ్లాక్‌లోని 15వ గేట్‌ను శుక్రవారం ఎత్తగా, మిగిలిన ఏడు గేట్లను ఎత్తడానికి పనులు చేస్తున్నారు.
Medigadda Damage Updates : వరద ప్రవాహానికి గేట్ల మధ్యలో ఇరుక్కున చెత్త చెదారం, మట్టిని కూలీలతో తీయిస్తున్నారు. ఆ బ్లాక్ ప్రాంతంలో స్థలాన్ని శుభ్రం చేస్తున్నారు. 16వ గేట్‌ను ఎత్తితే ఏర్పడే ఇబ్బంది, సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తుండగా, గురువారానికి ఎత్తే అవకాశం ఉంది. వరద ప్రవాహానికి కొట్టుకపోయి, చెల్లాచెదురుగా ఉన్న సీసీ బ్లాక్ అమరిక, స్యాండ్ గ్రౌటింగ్ పనులు సాగుతున్నాయి. వర్షాకాలంలో వరదను తట్టుకునేలా ఏడో బ్లాక్ ప్రాంతంలో షీట్ ఫైల్స్ ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
CWPRS Experts Visit Medigadda Today :మరోవైపు కాళేశ్వరంపై నిపుణుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు (సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణులు బ్యారేజీలను సందర్శించారు. సమగ్ర పరీక్షల తర్వాత ఎన్‌డీఎస్ఏ కమిటీ సూచనల మేరకే మేడిగడ్డ సహా మిగిలిన ఆనకట్టల మరమ్మతుల విషయంలో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే.
బ్యారేజీల వద్ద పరీక్షలు కూడా స్థానిక సంస్థలు కాకుండా ఎన్‌డీఎస్ఏ కమిటీ సూచించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలచేత చేయించాలని ప్రభుత్వం తీర్మానించింది. ఆనకట్టల పరీక్షల కోసం దిల్లీలోని సీఎస్ఎమ్ఆర్ఎస్, పూణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్, హైదరాబాద్‌లోని ఎన్‌జీఐఆర్ఐ సేవలను వినియోగించుకోవాలని తెలంగాణ సర్కార్‌కు తెలిపింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ఆయా సంస్థలను ఇప్పటికే సంప్రదించింది.