Medigadda Barrage Damage Issue Updates : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మేడిగడ్డ ఆనకట్టలో ఒప్పందం ప్రకారం చేయాల్సిన కొన్ని పనులను గుత్తేదారు సంస్థ చేయకుండానే వదిలేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్ధారించింది. ఇలా వదిలేసిన పనులకు బిల్లులు చేసుకున్నారన్న అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది.
Vigilance Inquiry on Medigadda Barrage : ప్రత్యేకించి మేడిగడ్డ బ్యారేజీ పని సమయంలో నీటిని మళ్లించేందుకు నిర్మించిన కాఫర్ డ్యాం (మట్టికట్ట)ను ఒప్పందం ప్రకారం తొలగించలేదని, ఎం.బుక్‌లో మాత్రం తొలగించినట్లు రికార్డు చేశారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా దీనికి వినియోగించిన ఇసుక, మట్టి, షీట్ పైల్స్ వరద సమయంలో కొట్టుకుపోయి ఆనకట్ట వద్ద అడ్డుపడటంతో నీటి ప్రవాహంలో మార్పు వచ్చినట్లు విజిలెన్స్ (Vigilance Inquiry on Medigadda) భావిస్తోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా సేకరించిన వివరాల మేరకు ఈ విషయాన్ని నిర్ధారించుకుంది.
కాళేశ్వరం 3 బ్యారేజీల్లోని నీళ్లన్నీ ఖాళీ చేయాల్సిందే! : నీటిపారుదల శాఖ
కాఫర్ డ్యాంను అలాగే వదిలేయడం వల్ల దానిలో వినియోగించిన ఇసుక, మట్టి ఆనకట్ట దిగువకు వచ్చి మేట వేసిందని, దీన్ని తొలగించడానికి మళ్లీ గుత్తేదారుకు అదనంగా చెల్లించినట్లు విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. భారీ వరద వచ్చినపుడు కాఫర్ డ్యాం క్రమంగా కొట్టుకుపోతే ఎలా ఉంటుంది, ఒక్కసారిగా మొత్తం కొట్టుకుపోయి బ్యారేజీని తగిలి ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుందో విశ్లేషిస్తున్నారు. ఇనుప షీట్‌పైల్స్ బ్యారేజీ దగ్గర పడి ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు.