Medical student Attempts Suicide In Siddipet : వైద్యవిద్యలో అడ్మిషన్ పొంది వారం రోజులు కూడా అవ్వక ముందే ఓ మెడికో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, మెడికల్ కళాశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన గాయత్రి అనే విద్యార్థిని సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో గల సురభి మెడికల్ కళాశాలలో మొదటి ఏడాది చదువుతోంది.
చదవలేకపోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి :ఈ నెల 17న గాయత్రి తాను అనారోగ్యం కారణంగా చదవలేకపోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఉదయం ఎనిమిది గంటల సమయంలో కళాశాల మొదటి అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో విద్యార్థినికి గాయాలవ్వగా సమచారమందుకున్న కళాశాల సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఘటనపై ఆరా తీసిన పోలీసులు :అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఆత్మహత్యాయత్నంకు కారణం ఏమై ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనపై సమాచారమందుకున్న ఏసీపీ మధు బుధవారం సురభి మెడికల్ కళాశాలను సందర్శించి ఘటనపై ఆరా తీశారు. గాయత్రి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా యాజమాన్యం పోలీసులకు పిర్యాదు చేయకపోవడంతో ఘటనపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.