Media Mogul Ramoji Rao Passed Away:తొమ్మిది దశాబ్దాల జీవితంలో 60 ఏళ్లకు పైగా ప్రజలతో కలిసి నడిచిన కృషీవలుడి ప్రయాణం కాలం గుండెపై పచ్చబొట్టయ్యింది. రామోజీరావు మరణంతో తెలుగు జాతి చరిత్రలో ఒక శకం ముగిసింది. "నేనొక స్వర్గం, నాదొక దుర్గం, అనర్గళం అనితరసాధ్యం నా మార్గం" అన్న మహాకవి మాటలకు అచ్చమైన ప్రతిబింబం రామోజీరావు జీవన ప్రస్థానం.! విశేషణాలకు అందని వ్యక్తిత్వం ఆయనది. కృష్ణా జిల్లా పెదపారుపూడి నుంచి పద్మవిభూషణ్ పురస్కారం వరకూ స్వశక్తితో ఎదిగి, ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలకు అన్నదాతైన అసామాన్యుడు రామోజీరావు.!
అంతర్జాతీయ పరిణామాలే వార్తలుగా చలామణీ అవుతున్న రోజుల్లో స్థానిక అంశాలకూ అగ్రతాంబూలమిస్తూ పత్రికను ప్రారంభించడం రామోజీరావు సాహసం. 'పెద్దల గలభా' శీర్షికతో వచ్చిన వార్తపై రామోజీరావు సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని అప్పటి ఉమ్మడి రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ ఆదేశాలిచ్చారు. వార్త పరంగా తమ తప్పేమీ లేదంటూ తలవంచడానికి అంగీకరించని రామోజీరావు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడారు.!
తొలిసారి 24 గంటల వార్తాస్రవంతికి శ్రీకారం : నమ్మిన విలువల కోసం వ్యవస్థలతోనైనా ఢీకొట్టగలిగిన ఆయన ధైర్యసాహసాల గురించి అప్పుడే యావద్భారతానికి తెలిసింది. తెలుగు జాతికి చేదోడువాదోడుగా, పాఠకాదరణలో తిరుగులేనిదిగా 'ఈనాడు' ఎదగడం రామోజీరావు సంకల్పబల అమృత ఫలం. పత్రికలో ప్రచురితమయ్యే ప్రతి అక్షరానికీ ప్రజాప్రయోజనాలే పరమావధి కావాలన్న ఆయన దిశానిర్దేశమే 'ఈనాడు'కు దారిదీపమైంది. ఈటీవీ న్యూస్ ఛానల్‌తో తెలుగునాట తొలిసారి 24 గంటల వార్తాస్రవంతికి శ్రీకారం చుట్టిందీ రామోజీరావే. విశ్వసనీయతకు మారుపేరుగా ఈటీవీని మలిచిందీ ఆయనే.!! డిజిటల్ యుగంలో పాఠకుల సౌలభ్యం కోసం 'ఈటీవీ భారత్'ను ఆరంభించి, ఆసేతుహిమాచలం దాన్ని విస్తరించారు.
అక్షర యోధునికి అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు - Ramoji Rao Final Rites Journey
రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మాణం: పట్టు పట్టరాదు పట్టి విడవరాదు అన్న వేమన వాక్కును నరనరాల్లో జీర్ణించుకున్న వ్యక్తి రామోజీరావు.! కొండలు, రాళ్లగుట్టలతో నిండిన నేలను భూలోక సినీస్వర్గంగా తీర్చిదిద్దిన పట్టుదల ఆయనకు సహజాభరణం. రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మాణంతో తెలుగువారి ఖ్యాతిని గిన్నిస్‌బుక్ ఎక్కించారు. రామోజీరావు పట్టిందల్లా బంగారమైందని అందరూ అంటారు! కానీ, విజయ సోపానాలు అధిరోహించేందుకు ఆయన పడిన తపన, చేసిన కృషి గురించి చాలామందికి తెలియదు.
పనిలోనే జీవితానందం : రామోజీ గ్రూప్ ఛైర్మన్‌గా పెదపారుపూడి పల్లెబిడ్డ అనునిత్యం అనుసరించిన మార్గం ఒక్కటే.! అదే క్రమశిక్షణ.! రోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేచే ఆయన వ్యాయామం, మితాహారాలతో నియమబద్ధ జీవనశైలిని పాటిస్తూ, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యమిచ్చేవారు. పనిలోనే జీవితానందాన్ని అన్వేషించి, ఆస్వాదించిన కార్యదీక్షాశీలి రామోజీరావు.! శ్రమే దైవమని విశ్వసించిన ఆయన పనిచేస్తూనే ఒరిగిపోవాలని కోరుకున్నారు. అందుకు తగినట్లే పెద్ద వయసులోనూ తరగని ఉత్సాహంతో ఆఖరి క్షణం వరకు శ్రమించారు.
మార్గదర్శి ద్వారా బంగారు భవిష్యత్ : పిల్లకాల్వలెన్ని పోటీపడినా జీవనదికి సాటిరావు.! చేతులెన్ని అడ్డుపెట్టినా రవికిరణాలు నేలకు చేరకుండా పోవు.! రామోజీరావు విశ్వసనీయతా అలాంటిదే. నీతి, నిజాయతీ, విశ్వాసం, వినమ్రత, వృత్తి నిబద్ధతలే పంచప్రాణాలుగా 1962లో 'మార్గదర్శి'కి ఊపిరిపోశారాయన. అరవై ఏళ్లలో అది ఇంతింతై వటుడింతై అన్నట్లుగా శాఖోపశాఖలైంది! మార్గదర్శిపై ధూర్త రాజకీయ మబ్బులు కమ్మినా ఖాతాదారుల్లో నమ్మకం చెక్కుచెదరలేదు. అదీ రామోజీరావుపై ప్రజల విశ్వాసం! నేటి ఆదాయంలోంచి దాచుకునే కొద్దిపాటి పైకమే రేపటి బంగారు భవిష్యత్తుకు భరోసా అవుతుందనే సందేశాన్ని 'మార్గదర్శి' ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది.