Medaram Sammakka Sarakka Jatara 2024 : ములుగు జిల్లాలోని మేడారంలో కొలువైన వనదేవతలకు రెండేళ్లకోసారి మాఘ మాసంలో జాతర జరుగుతుంది. ఈనెల 21 నుంచి 24 వరకూ జరగనున్న జాతరకు రూ. 110 కోట్లు కేటాయించిన ప్రభుత్వం పటిష్ఠ ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి సీతక్క అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వనదేవతలు గద్దెలపై ఆగమనానికి నెల రోజుల ముందు నుంచే భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. బంగారంగా కొలిచే బెల్లాన్ని కానుకగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
Sammakka Sarakka Jatara 2024 :భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే జంపన్నవాగు నీటితో కళకళలాడుతోంది. ఈనెల 14న అధికారులు లక్నవరం సరస్సు(Laknavaram Lake) తూములు తెరిచి సద్ది మడుగు చెరువుకు నీటిని వదిలారు. 17న సాయంత్రం సద్దిమడుగు చెరువుతూములు తెరవడంతో దయ్యాల వాగు మీదుగా ముట్లగూడెం గ్రామాల సమీపంలోని జంపన్న వాగులోకి ప్రవహిస్తూ మేడారం వద్దకు నీళ్లు చేరాయి. నాలుగు చెక్ డ్యామ్‌లలో నీరు నిండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. జంపన్నవాగులో స్నానాలు చేస్తున్న భక్తులు, వనదేవతల్ని దర్శించుకుంటున్నారు.
మేడారం జాతరకు 30 ప్రత్యేక రైళ్లు - టైమింగ్స్ సహా పూర్తి వివరాలు ఇవే
'మేడారం సమక్క సారక్క జాతరకు మేము ప్రతిసారి వస్తాం. ఇది ఆరోసారి మేము ఇక్కడికి రావడం . తల్లిని దర్శించుకోవడం మా భాగ్యం. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి జంపన్న వాగులో స్నానం చేసి, సమక్క గద్దెల వద్ద ఎత్తు బంగారం సమర్పించుకుంటాం. మా కోరికలను మన్నించి నెరవేర్చే ఆ తల్లికి ఒడి బియ్యం సమర్పిస్తాం. జంపన్న వాగులో ఇన్నిరోజులు నీళ్లు లేవని చాలా మంది అన్నారు. కానీ ఇప్పుడు చాలా నీళ్లు వచ్చాయి. ఇక్కడ ట్యాప్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఎవరికీ ఇబ్బంది లేకుండా బాత్రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు'- భక్తులు