Medaram Jatara Route Map 2024 : వనంలో ఉన్న దేవతలు జనం మధ్యకు వచ్చే శుభ సమయం ఆసన్నమైంది. జంపన్నవాగు జన సంద్రంగా మారే ఘడియలు సమీపిస్తున్నాయి. దట్టమైన అడవులు, కొండకోనల నడమ మేడారం సమ్మక్క- సారక్క జాతర సాగనుంది. వరంగల్‌కు 110 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో కొలువైన వనదేవతలకు రెండేళ్లకోసారి మాఘ మాసంలో పార్ణమికి ముందు ఈ జాతర జరుగుతుంది.
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన ఈ మహాజాతరకు పిల్లా పెద్దా అంతా కుటుంబ సమేతంగా కదులుతారు. కోటిమందికిపైగా వచ్చే భక్తులతో మేడారం (Medaram Jatara 2024) భక్తజన సంద్రమవుతుంది. ఈసారి జాతరకోసం తెలంగాణ ప్రభుత్వం రూ.110 కోట్లు వెచ్చించి విస్తృత ఏర్పాట్లు చేసింది. జాతర సజావుగా జరిగేందుకు పోలీసు శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరి వరంగల్, ఇతర ప్రాంతాలనుంచి వచ్చే భక్తులు మేడారానికి ఎలా వెళ్లాలి? తిరుగు ప్రయాణం, పార్కింగ్ సదుపాయాలు, క్యూలైన్లు ఎక్కడెక్కడ తదితర విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
మేడారం వెళ్లడానికి వీలు కావడం లేదా? - ఇంట్లో నుంచే వనదేవతలకు బంగారం సమర్పించండిలా
మరోవైపు వనదేవతలు గద్దెలపై ఆగమనానికి నెల రోజుల ముందు నుంచే భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. వ్యయ ప్రయాసలను లెక్కచేయక కుటుంబ సమేతంగా వచ్చి తల్లులను దర్శించుకుంటున్నారు. బంగారంగా కొలిచే బెల్లాన్ని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తమ కోరికలు నేరవేర్చితే ఎత్తు బంగారం సమర్పిస్తాం తల్లి అంటూ మొక్కుకుని, అవి తీరిన వెంటనే తమతో సరితూగే బెల్లాన్ని అమ్మవార్లకు ఇస్తుంటారు. తరతరాలుగా ఈ సంప్రదాయం నడుస్తోంది.