Medaram Jatara 2024 :మాఘమాసం పౌర్ణమి వెలుగుల్లో మేడారం మహా జాతర అట్టహాసంగా ప్రారంభమవుతోంది. రెండేళ్లకోసారి జరిగే జనజాతర పూర్తిగా ఆదివాసీ సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. నాలుగు రోజుల పాటు కోలాహలంగా వనంలో జరిగే సంబురమిది. ఆదివాసీ జాతరలో తొలి రోజు పూజారులు వెంటరాగా, డప్పు శబ్దాలు, డోలు వాద్యాల నడుమ సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి వేంచేయనున్నారు.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఎలా వెళ్లాలో తెలుసా? - ఇదిగో రూట్ మ్యాప్
Medaram Sammakka Saralamma Jatara 2024 :ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుండ్ల నుంచి బయల్దేరిన పగిడిద్దరాజు (Pagididda Raju) మంగళవారం రాత్రి గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో బస చేసి, ఈరోజు రాత్రికి గద్దెల వద్దకు చేరుకుంటారు. ఇదే సమయంలో కన్నెపల్లి నుంచి సారలమ్మ ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు డప్పు, డోలు వాద్యాల నడుమ గద్దెలపైకి విచ్చేస్తారు.
"ఈరోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను, పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులును తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేస్తాం. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తాం. ఆ తర్వాత గద్దెలపైకి తీసుకువస్తాం. గురువారం సమీపంలోని చిలకలగుట్ట పైనుంచి కుంకుమ భరిణె రూపంలో సమక్కను తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తాం. శుక్రవారం నిండు జాతర కాగా, శనివారం దేవతల వన ప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది." - అరుణ్ కుమార్, మేడారం పూజారి
కన్నెపల్లి నుంచి జంపన్నను డప్పుడోలు వాద్యాలతో కోలాహలంగా జంపన్న వాగు సమీపంలోని గద్దెకు చేర్చారు. అనంతరం జంపన్నకు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివాసీ సంప్రదాయాలతో జంపన్నను కొలిచారు. జాతరను పురస్కరించుకుని మేడారం (Medaram Jatara 2024) విద్యుద్దీప కాంతులతో శోభాయమానమైంది. మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ క్షణం కూడా విరామం లేకుండా దర్శనాలు జరుగుతున్నాయి.