Margadarsi Chit Fund : చిట్ ఫండ్ పరిశ్రమలో నమ్మకమైన, అగ్రగామిగా ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మరో రెండు శాఖలను ప్రారంభించనుంది. ఇవాళ బెంగళూరులోని కెంగేరిలో 119వ శాఖను ప్రారంభించనుంది. అలాగే తమిళనాడులోని హోసూర్‌లో 120వ శాఖను సాయంత్రం ప్రారంభించనున్నారు. అత్యంత విశ్వసనీయమైన, కస్టమర్ ఫ్రెండ్లీ మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీకి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో నెట్వర్క్ ఉంది. నమ్మకమే మారుపేరుగా అందరి మదిలో మార్గదర్శి సుస్థిర స్థానం సంపాదించుకుంది.
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త బ్రాంచ్‌లు ప్రారంభించనున్న సందర్భంగా మార్గదర్శి చిట్‌ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. "బెంగళూరులోని కెంగేరిలో బ్రాంచ్‌ను ప్రారంభించడం మాలక్ష్యంలో ఒక ముఖ్యమైన ముందడుగు. కర్ణాటక ప్రజలకు ఆర్థిక స్వాతంత్య్రం మరింత చేరువైంది. మా చందాదారులు తమ లక్ష్యాలను సాధించటంలో సహాయపడటానికి సురక్షితమైన, పారదర్శకమైన, క్రమశిక్షణతో కూడిన పొదుపు ఎంపికలను అందించడానికి మార్గదర్శి చిట్‌ఫండ్ కట్టుబడి ఉంది." అని తెలిపారు.
విశ్వసనీయతే ఆయుధం : 1962లో ప్రారంభమైనప్పటి నుంచి మార్గదర్శి చిట్ ఫండ్ విశ్వాసం, విశ్వసనీయతకు మారుపేరుగా ఉందని మార్గదర్శి చిట్‌ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ అన్నారు. 60 లక్షల మంది సబ్‌స్కైబర్లకు సేవలు అందిస్తోందని తెలిపారు. అలాగే రూ.9,396 కోట్ల టర్నోవర్ సాధించిందని పేర్కొన్నారు. సమగ్ర, ఆర్థిక, క్రమశిక్షణ, పారదర్శకత, ప్రతిదానికి భరోసా చందాదారుల డబ్బు సురక్షితమైన చేతుల్లో ఉందని మేనేజింగ్ డైరెక్టర్ స్పష్టం చేశారు.