Nissan Honda Merge : జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థలు హోండా, నిస్సాన్ మోటార్ విలీనం కానున్నాయి. ఈ మేరకు ఇరు సంస్థలు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు నిస్సాన్ సీఈఓ సోమవారం ప్రకటించారు. నిస్సాన్ భాగస్వామి అయిన మిత్సుబిషి మోటార్స్ కూడా ఈ ఒప్పందాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆటో గ్రూప్‌గా తన సంస్థ అవతరించనుందని తెలిపారు.
జాయింట్ హోల్డింగ్ కంపెనీ కింద హోండా, నిస్సాన్ తమ ఆపరేషన్స్ చేపట్టనున్నట్లు హోండా మోటార్స్ సీఈఓ తోషిహిరో మైబ్ వెల్లడించారు. తొలుత హోండా కంపెనీ ఈ కార్యకలాపాలను చూసుకుంటుందని తెలిపారు. తద్వారా కంపెనీల మౌలిక సూత్రాలను, బ్రాండ్ ఇమేజ్‌లను కాపాడుకోవచ్చని అన్నారు. ఈ విలీనం గురించి జూన్‌లోగా అధికారిక ప్రకటన చేయనున్నట్లు చెప్పారు. ఆగస్టు 2026 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
2023లో హోండా 8 మిలియన్, నిస్సాన్ 3.4 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేసింది. మిత్సుబిషి మోటార్స్ కేవలం మిలియన్ వాహనాలను మాత్రమే ఉత్పత్తి చేసింది. విలీనం తర్వాత హోండా, నిస్సాన్ సంయుక్తంగా వాహనాల వార్షిక ఉత్పత్తిని 74 లక్షలకు తీసుకెళ్లనున్నాయి. దీంతో టయోటా, ఫోక్స్‌వ్యాగన్ తర్వాత వాహనాలు విక్రయాల ద్వారా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆటో గ్రూప్‌గా అవతరించనుంది.
విలీనంతో పెరిగి నిస్సాన్ షేర్లు విలువ
డిసెంబర్ ప్రారంభంలో ఈ రెండు కంపెనీల విలీనానికి సంబంధించిన వార్తలు వచ్చాయి. అలాగే, ప్రపంచవ్యాప్తంగా వాహన పరిశ్రమలో నెలకొన్న పోటీని ఎదుర్కొనేందుకు ఇరు సంస్థలు తాజా నిర్ణయానికి వచ్చాయని, ఇప్పటికే అందుకు సంబంధించిన చర్చలు కూడా జరిపినట్లు కథనాలు వెలువడ్డాయి. విలీన వార్తలు వెలువడిన తర్వాత నిస్సాన్ కంపెనీ షేర్లు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. రికార్డు స్థాయిలో 24 శాతం పెరిగాయి. సోమవారం 1.6శాతం లాభల్లో ఉండగా, హోండా షేర్లు 3.8శాతం వృద్ధి చెందాయి. ఇదిలా ఉండగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఈ ఏడాది మార్చిలోనే రెండు సంస్థలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాయి.