Thieves Looted Hundi in Nirmal Temple : నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని రాజరాజేశ్వరుని ఆలయంలో చోరీ జరిగింది. గర్భగుడి ముందు మండపంలో ఉన్న హుండీని గుర్తు తెలియని ఇద్దరు దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ తతంగమంతా మండపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం : నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని రాజరాజేశ్వరుని ఆలయంలో రాత్రి ఇద్దరు దొంగలు చొరబడ్డారు. గర్భగుడి ముందున్న హుండీలోని డబ్బులను తీసేందుకు ప్రయత్నాలు చేశారు. హుండీ ఎంతకూ తెరుచుకోకపోవడంతో హుండీని బయటి దాకా పట్టుకొని వెళ్లి కారులోని వెనుక డిక్కీలో వేసి తీసుకెళ్తున్నారు. ఇంతలో దేవుడే హుండీని కాపాడుకున్నట్టుగా కారు గుంతలో పడి ఒక్కసారిగా పంక్చర్ అయింది. దీంతో ఏం చేయాలో ఆ దొంగలకు తోచలేదు. టైరు మార్చేందుకు ప్రయత్నాలు చేసినా, అటువైపు నుంచి కొంత మంది వ్యక్తులు రావడంతో భయపడి దొంగలు పారిపోయారు.
ఆలయంలో హుండీ దొంగతనం : ఇదంతా గమనించిన స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి ఆలయంలో చోరీ జరిగినట్టు గుర్తించారు. వెంటనే కేసు నమోదు చేసుకొని 3 బృందాలుగా ఏర్పడి రాత్రంతా ఆలయ పరిసరాలన్నీ గాలించారు. కొంతసేపటికి ఇద్దరు దొంగలను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఆలయంలో చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఈ చోరీకి ముందు భైంసా మండలంలోని వానల్పాడ్ గ్రామంలోని ఓ ఆలయంలోనూ చోరీకి యత్నించారని పోలీసు దర్యాప్తులో తేలింది.
హనుమకొండ పెద్దమ్మ తల్లి ఆలయంలో చోరీ - సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు - Temple Robbery In Hanamkonda