Margadarshi MD Shailaja Kiron Shared Memories of her Father in Law Ramoji Rao : ‘శైలజమ్మా..’ అంటూ ఆప్యాయంగా పిలిచే మావయ్యగారి గురించి ఏమని చెప్పను? ఎంతని చెప్పను? తెల్లటి దుస్తులు, సూటిగా చూసే కళ్లు, మూర్తీభవించిన విగ్రహం. మొదటిసారి ఆయన్ని చూడగానే విలక్షణమైన, విశిష్టమైన వ్యక్తిత్వం అనుకున్నా. అలా మా పెళ్లిచూపుల్లో మొదటిసారి ఆయన్ని చూశా. ఆ రూపం ఇప్పటికీ నాకు గుర్తుంది. అసలు మా పెళ్లి చిత్రంగా జరిగింది. చాలామంది కిరణ్‌గారూ, నేనూ క్లాస్‌మేట్స్ అనుకుంటారు. కానీ కాదు. నేను చదివిన కోయంబత్తూరు కాలేజ్‌లో ఆయన నాకు సీనియర్. నేను వెళ్లేసరికే ఆయన చదువు పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. నేను చేరిన మొదటి ఏడాదే మా ప్రొఫెసర్ సంతానలక్ష్మిగారు ‘ఈనాడు సంస్థ వాళ్లు మంచి అమ్మాయి ఉంటే చెప్పమని అడిగారు. నీ పేరు చెప్పా’ అన్నారు. అయితే కిరణ్‌గారు వాళ్లమ్మగారితో టైమ్ కావాలని అనడంతో ఆ ప్రస్తావన అక్కడితో ఆగిపోయింది.
నిజానికి నేను చెన్నైలో చదువుకోవడంవల్ల నాక్కూడా ఈనాడు పత్రిక పేరు వినడమేగానీ రామోజీరావుగారి గురించి పెద్దగా తెలియదు. ఎంబీఏ పూర్తయి ఇంటికొచ్చాక తిరుపతి మేనేజరుగారు మా ఇంటికి వచ్చి మళ్లీ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. నాన్నగారూ సరే అనడంతో నన్ను చూడ్డానికి కిరణ్‌గారూ మావయ్యగారూ కుటుంబంతో కలిసి వచ్చారు. అందరిలానే ఆయన నన్ను కొన్ని ప్రశ్నలడిగారు. ‘నాకు వర్క్ చేయడం ఇష్టం’ అని చెప్పా. తరవాత రెండు రోజులకి మావయ్యగారు ఇంటికి ఫోన్ చేసి ‘మాకిష్టమేనమ్మా.. నీకిష్టమేనా?’ అని అడిగారు. వెంటనే నేను ‘మీ ఇంటికి కోడలుగా రావడం వరంగా భావిస్తున్నా’ అన్నా. పెళ్లయ్యి వచ్చాక కూడా కొత్తలో ఆయనంటే కాస్త భయం ఉండేది. అత్తమ్మ సౌమ్యంగా ఉండేవారు.
మావయ్య చాలా బిజీగా, ఎప్పుడూ చదువుతూ ఉండేవారు. ఆయన ఏం అడుగుతారో, ఏం చెప్పాలో రిహార్సల్ వేసుకుని మరీ ఆయన దగ్గరకు వెళ్లేవాళ్లం. అయినా కొన్ని ప్రశ్నలకు మా దగ్గర సమాధానం ఉండేది కాదు. మా కోడళ్లిద్దరినీ శైలజమ్మా, విజయమ్మా అంటూ ప్రేమగా పిలిచేవారు. దాంతో మా భయం తగ్గింది. మా కుటుంబం అనే కాదు, ఆయనకు ఇద్దరు అక్కలు. మేనకోడళ్లూ, మేనల్లుళ్లన్నా ఎంతో అభిమానం, ప్రేమ. అత్తమ్మ తరపు బంధువుల్నీ అంతే ప్రేమించేవారు. పెళ్లయిన కొత్తలో అందరినీ చూపించి ‘మన కుటుంబం’ అని చెప్పేవారు.
నిజానికి ఆయన పైకి గంభీరంగా ఉన్నా చాలా సెన్సిటివ్. మాకు తొలిసారి బాబు పుట్టి చనిపోయాడు. అప్పుడు ఆయన మద్రాస్ హాస్పిటల్‌కు వచ్చారు. ఆ బాబుని చూసి కళ్లమ్మట నీళ్లు పెట్టుకున్నారు. అలా ఆయన్ని ఎప్పుడూ చూడలేదు. బాబు మరణం మమ్మల్ని అందరినీ ఎంతో బాధించింది. తరవాత సుమన్ మరణం. ఈ రెండూ మా కుటుంబానికి తీరని లోటు. ఆయన్నీ తీవ్రంగా కదిలించాయి.
ఇంట్లో సరదాగా! :మావయ్య పనిలో బిజీగా ఉండటంతో అత్తమ్మే అన్నీ చూసుకునేవారు. మా ఇంట్లో ప్రతీదీ టైమ్ ప్రకారం జరగాలి. సంస్థల్లో మాదిరిగానే ఇంట్లోనూ సమయానికి అన్ని పనులూ అయ్యేలా వ్యవస్థ ఉంటుంది. ఛైర్మన్‌గారు ఉదయాన్నే భోజనం చేసి వెళ్లిపోయేవారు. మధ్యాహ్నం స్నాక్స్, రాత్రికి పండ్లు మాత్రమే తీసుకునేవారు. మావయ్యగారికి పెసరట్టు అంటే ఇష్టం. ఆదివారం ఎవరినీ కలవడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. ఈ ఒక్కరోజైనా షేవ్ చేసుకోనక్కర్లేకుండా హాయిగా పంచెలో ఉండొచ్చు కదా అనుకునేవారు.
పైగా ఆరోజు ఇంకా ఎక్కువగా చదువుకునేవారు. నా పెళ్లయిన కొత్తల్లో ఆదివారం సాయంత్రం దూరదర్శన్‌లో ఏ సినిమా వచ్చినా చూసేవారు. ఇదొక్కటే కదా నాకు వినోదం, విరామం అని నవ్వేవారు. ప్రతి ఆదివారం లంచ్ అందరం కలిసి చేసేవాళ్లం. పండుగలమీద ఆయనకు ప్రత్యేకమైన ఆసక్తి లేకపోయినా, మమ్మల్ని వద్దనేవారు కాదు. ఫిల్మ్‌సిటీకి వచ్చాక దీపావళి వస్తే మనవరాళ్లూ అంతా ఒకచోట టపాసులు కాలుస్తుంటే ఇష్టంగా చూసేవారు.
విశేషాధికారం :పెళ్లి అనేది మావయ్య దృష్టిలో ఎంతో విలువైనది. ఇద్దరికీ అర్థం చేసుకునే మనసు ఉండాలి. అప్పుడే అది కలకాలం ఉంటుందని తరచూ చెప్పేవారు. అవన్నీ వింటూ పెరగడం వల్లేనేమో మా నలుగురు అమ్మాయిలూ అబ్బాయీ కూడా ఎంతో పద్ధతిగా పెరిగారు. ఒకరకంగా చెప్పాలంటే మాకన్నా వాళ్లంటేనే మావయ్యగారికి ఎంతో ప్రేమ. దానికో కారణముంది. చిన్నతనంలో ఆయన వాళ్ల తాతగారి దగ్గరకు వెళితే ఆయన నిత్యం భక్తి భావనలో ఉంటూ చిన్న నామం పెట్టి పంపేసేవారట. దాంతో తాతతో సరదాగా ఆడుకోవాలి, కబుర్లు చెప్పాలి అన్న కోరిక తీరలేదు.
అది తన మనవడూ మనవరాళ్లూ మిస్సవ్వకూడదు అనుకునేవారు. అందుకే వాళ్లేం చేసినా ఊరుకునేవారు. అందులోనూ మా పెద్దమ్మాయి సహరి అంటే మరీనూ. ఆయన మీదెక్కి ఆడుకునేది. ఎగిరి దూకేది. ఓరోజు అందరం భోజనం చేస్తుండగా ఆయన పక్కన పెట్టిన వాచీ తీసి తలమీద పెట్టింది. అది చూసి నేను భయంతో చూస్తుంటే మావయ్యగారు నవ్వేసి, దాన్ని చేతికి పెట్టుకున్నారు. ఇది తాతమీద మనవలకు మాత్రమే ఉండే విశేషాధికారం అనేవారు. అలాగే పిల్లల్ని మార్కులకోసం ఇబ్బంది పెట్టొద్దు. జీవితమే పాఠాలు నేర్పిస్తుంది. మధ్య తరగతి వాళ్లు చదివే స్కూళ్లూ కాలేజీల్లో చదివితేనే వాళ్లకు అన్నీ తెలుస్తాయి అనేవారు. ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం అని తరచూ చెప్పేవారు.