The Accused in Rape Case Hanged Himself in the Police Station : నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని ఓ గ్రామంలో ఈ నెల 12న బాలికపై జరిగిన అత్యాచారయత్నం కేసులో నిందితుడు మృతి విషయం కొత్త మలుపు చోటుచేసుకుంది. అతడు మృతి చెందింది స్థానికుల దాడి వల్ల కాదని, పోలీస్ స్టేషన్‌లోనే ఉరి వేసుకుని మరణించాడని తెలుస్తోంది. కాగా ఈ విషయాన్ని స్థానిక పోలీసు అధికారులెవరూ ధ్రువీకరించడం లేదు. ఈ ఘటనకు సంబంధించి ప్రసాద్ అనే కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఎస్సై సాయన్నకు, లింబాద్రి, లక్ష్మణ్ ఇద్దరు కానిస్టేబుళ్లకు ఛార్జీ మెమోలు జారీ చేశారు.
అసలు ఏం జరిగిందంటే? : నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల గ్రామానికి చెందిన రెడ్యా అనే వృద్ధుడు మానసిక స్థితి సరిగ్గా లేని పదేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడంటూ ఆమె బంధువులు, స్థానికులు ఈ నెల 12వ తేదీ రాత్రి నిందితుడిపై దాడి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అదే రోజు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ఓ గదిలో ఉంచారు.

విచారణలో వెల్లడించిన పోలీసులు : తెల్లవారుజామున రెడ్యాను మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అస్వస్థతకు గురైతే తీసుకొచ్చినట్లు తెలిపారు. కాసేపటికే అతడు మృతి చెందాడని పోలీసులు ప్రకటించారు. స్థానికుల దాడిలో గాయపడటం వల్లే అతడు మృతి చెందినట్లు అందరూ భావించారు. కానీ నిందితుడు పోలీస్ స్టేషన్‌లోనే తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం. దీనిపై మృతుడి బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిపై మెదక్ జిల్లా తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి విచారణ చేపట్టగా, నిందితుడు అవమాన భారంతోనే ఉరి వేసుకున్నాడని ఇక్కడి పోలీసులు తెలిపినట్లు తెలుస్తోంది. మరోవైపు నిందితుడిపై దాడి ఘటనలో ఏడుగురిని మంగళవారం రాత్రి అరెస్టు చేసినట్లు బోదన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.