U 19 Womens Asia Cup 2024 : కౌలాలంపూర్ వేదికగా తాజాగా జరిగిన అండర్ - 19 ఆసియా కప్ విజేతగా భారత మహిళా జట్టు అవతరించింది. టీ20 ఫార్మాట్‌లో మహిళల విభాగంలో తొలిసారి జరిగిన ఈ టోర్నీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది టీమ్‌ఇండియా. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 117/7 పరుగులు స్కోర్ చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ పేలవ ఫామ్‌తో 76 పరుగులకే కుప్పకూలింది. దీంతో 41 పరుగులు తేడాతో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది.
మ్యాచ్ సాగిందిలా :
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కమిలిని (5), వన్ డౌన్ బ్యాటర్ సానికా చల్కే (0) వెనువెంటనే ఔటయ్యారు. అయితే, మరో ఓపెనర్ త్రిష (52) మాత్రం అర్ధ సెంచరీతో రాణించి జట్టును గట్టెక్కించింది. కెప్టెన్ నికీ ప్రసాద్ (12)తో కలిసి ఆమె జట్టును ఆదుకొంది. దీంతో ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 41 పరుగులు జోడించారు. కెప్టెన్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఐశ్వరి (5) ఎక్కువ సేపు నిలవలేకపోయింది. బంగ్లా బౌలర్లు విజృంభించడం వల్ల ఐశ్వరితో పాటు హాఫ్ సెంచరీ సాధించిన త్రిష కూడా అనూహ్యంగా పెవిలియన్‌కు చేరింది. దీంతో భారత్ స్కోరు వంద దాటుతుందా? లేదా అనే అనుమానం తలెత్తింది. అయితే మిథిలా (17), ఆయుషి శుక్లా (10) ఆఖరిలో తమ దూకుడు పెర్ఫామెన్స్‌తో జట్టు స్కోర్‌ను మూడెంకలు చేశారు. ఇక బంగ్లా బౌలర్లలో ఫర్జానా 4 వికెట్లు పడగొట్టగా, నిషితా అక్తర్ నిషి 2, హబిబా ఒక వికెట్ తీశారు.
ఆ ఇద్దరు మాత్రమే
అయితే బౌలింగ్‌కు పిచ్ అనుకూలంగా ఉండటం వల్ల భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యం కూడా బంగ్లాకు పెద్దగా అనిపించింది. దీంతో ఆ జట్టులో జౌరియా ఫెర్డోస్ (22), ఫహోమిదా చోయా (18) తప్ప మిగతా ఎవరూ రెండెంకల స్కోరు నమోదు చేయలేకపోయారు. ఇవా 0, సుమైయా అక్తర్ సుబోర్నా 8, కెప్టెన్ సుమైయా అక్తర్ 4, సైదా అక్తర్ 5, జన్నతుల 3, హబిబా 1, ఫర్జానా 5, నిషిత అక్తర్ ఒక పరుగు స్కోర్ చేశారు. ఇక భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 3, సిసోదియా 2, సోనమ్ యాదవ్ 2, జోషిత ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.